* అమెరికా స్టేట్స్ మాదిరిగా ప్రత్యేక ట్యాగ్‌లైన్ పెట్టుకుందాం..
* కాలిఫోర్నియాలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్ డెస్క్ : ‘మేం న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ ( Telangana Future state ) అని పిలుద్దాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth reddy ) పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్‌కు పర్యాయపదంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు.
ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు. ఎన్నో ఏండ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
——————————-