Telangana Gram Panchayats
ప్రభుత్వం కీలక ఆదేశాలు
అకేరు న్యూస్,హైదరాబాద్ : గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య విభేదాల కారణంగా చెక్కుల చెల్లింపులు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. చెక్కులపై సంతకాలు చేయడంలో ఉప సర్పంచ్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
కారణం లేకుండా ఏడు రోజులకు మించి చెక్కులపై సంతకం చేయకుండా జాప్యం చేస్తే కలెక్టర్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
అదే సమయంలో, ఎలాంటి కారణం లేకుండా ఏడు రోజులకు మించి చెక్కుల సంతకాలలో జాప్యం జరిగితే ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ లేదా ఎంపీడీవోలో ఒకరికి జాయింట్ చెక్ పవర్ కల్పించేలా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో గ్రామ పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల వినియోగంలో జాప్యాన్ని నివారించే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
