Rain Alert Weather Alert
* తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..
* ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది.
నేడు కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో సాధారణంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరానికి ప్రస్తుతం భారీ వర్షాల హెచ్చరిక లేకపోయినా మేఘావృత వాతావరణం, అక్కడక్కడ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
* అత్యధికంగా 14 సెం.మీ. నమోదు..
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏపీలోని విశాఖ జిల్లాలో అత్యధికంగా 14 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో 9.8 సెం.మీ. వర్షం కురిసింది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 10 సెం.మీ., కెరమెరిలో 9 సెం.మీ. వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 7 సెం.మీ., ఆదిలాబాద్ జిల్లాలో 7.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
అలాగే ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో 7 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
* ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు అధికారులు అప్రమత్తం చేశారు.
తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
* సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి నీరు
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి భూపాలపల్లి డివిజన్లోని కాకతీయ ఓపెన్‌కాస్ట్-2, 3 ఉపరితల గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. వర్షపు నీరు చేరడంతో సింగరేణి సంస్థకు దాదాపు రూ.కోటి మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఈ వర్షాలు ప్రయోజనం చేకూరుస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
