Minister Seethakka, Telangana Panchayat Funds
* బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే పంచాయతీ నిధులు
* మంత్రి సీతక్క సంచలన నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామ పంచాయతీల స్వయంప్రతిపత్తిని పెంపొందించడం, స్థానిక సంస్థల ఆర్థిక నిర్వహణను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వేదికగా తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు మరియు దాని ద్వారా చేకూరే ప్రయోజనాలను ఆమె వివరంగా అసెంబ్లీ సభాముఖంగా వెల్లడించారు.
*సవరణ బిల్లు ముఖ్య అంశాలు..
చట్టంలో మార్పులు: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70, సబ్-సెక్షన్ (3)కి తగిన సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ట్రెజరీ కష్టాలకు చెక్: ఇదివరకు గ్రామ పంచాయతీలు సమీకరించే స్వంత నిధులు (పన్నులు, ఇతర రకాల ఆదాయాలు) కచ్చితంగా ప్రభుత్వ ఖజానా (Treasury)లోనే జమ చేయాల్సి ఉండేది. నూతన సవరణ ద్వారా ఈ సొంత నిధులను (Own Resources) కూడా సమీప జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులలో జమ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
* కేంద్ర, రాష్ట్ర పథకాల తరహాలోనే..
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చే నిధులను నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో జమ చేసుకుంటున్న రీతిలోనే, ఇకపై పంచాయతీల సొంత నిధులను కూడా అదే రీతిలో డిపాజిట్ చేసుకోవచ్చని సభకు వివరించారు. మున్సిపల్ చట్టంతో సమానత్వం: తెలంగాణ పురపాలక చట్టం 2019 (సెక్షన్ 106, సబ్-సెక్షన్ 2) పరిధిలోని మున్సిపాలిటీలకు ఎలాంటి ఆర్థిక నిర్వహణ సౌలభ్యం ఉందో, అదే స్థాయిలో గ్రామ పంచాయతీలకు కూడా ఆర్థిక స్వతంత్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.
* సవరణకు గల కారణాలు, ప్రయోజనాలు..
సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, పాత పద్ధతి వల్ల ఎదురవుతున్న క్షేత్రస్థాయి ఇబ్బందులను ప్రస్తావించారు. ఖజానా (Treasury) ప్రక్రియ ద్వారా నిధుల విడుదల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీనివల్ల పంచాయతీ సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నామని దృష్టికి వచ్చిందన్నారు. గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన చిన్న చిన్న అభివృద్ధి పనులు, నిత్య నిర్వహణ ఖర్చులు, పారిశుధ్య బాధ్యతలు నెరవేర్చడానికి ఈ జాప్యం ఆటంకంగా మారిందన్నారు. ఈ నూతన బ్యాంకింగ్ విధానం వల్ల పంచాయతీ ప్రతినిధులు త్వరితగతిన నిధులను డ్రా చేసుకునే వీలుంటుంది. ఖజానాపై ఆధారపడే అవసరం తగ్గి, గ్రామ పంచాయతీల స్థాయిలో సుపరిపాలన మరియు వేగవంతమైన ఆర్థిక నిర్వహణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
