Cyber Crime Investment Fraud
* 60 శాతం మోసాలు అవే
* పౌరుల అత్యాశే సైబర్ నేరగాళ్ల మోసాలకు పెట్టుబడి
* నమ్మి సేవింగ్స్ కోల్పోతున్న బాధితులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : “ఇంట్లో కూర్చునే రోజువారీ సంపాదన.. పెట్టిన పెట్టుబడికి కొన్ని రోజుల్లోనే రెట్టింపు లాభాలు..” సోషల్ మీడియాలో ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి చాలా మంది ఆశపడుతున్నారు. కష్టపడకుండానే తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించవచ్చనే అత్యాశో, లేదా అదనపు ఆదాయం సంపాదించాలన్న కోరికో వారిని నిండా ముంచేస్తోంది. మోసాన్ని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
తాజాగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించినట్టుగా, రాష్ట్రంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో ఏకంగా 60 శాతం పెట్టుబడి మోసాలే కావడం ఆందోళనకరమైన విషయం.
*మోసగాళ్ల వల.. దోచే తీరు ఇలా..
సైబర్ కేటుగాళ్లు ప్రజల ఆశను, బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. మొదట నమ్మకం పుట్టించి.. చివరకు సర్వస్వం దోచుకుంటున్నారు. గడిచిన రెండేళ్లలో ఇలాంటి మోసాల్లో బాధితులు పోగొట్టుకున్న రూ.455 కోట్లను తెలంగాణ పోలీసులు రికవరీ చేశారంటే ఈ నేరాల తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లేదా వాట్సాప్‌లలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ లేదా ఆన్లైన్ పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు వదులుతారు. ఆసక్తి చూపిన వ్యక్తులను వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్‌లలో చేరుస్తారు. ఆ గ్రూప్‌లో ఉన్న మిగతావారంతా తాము భారీగా లాభాలు ఆర్జించామని నకిలీ స్క్రీన్షాట్లు పెడుతుంటారు. నిజానికి ఆ గ్రూప్‌లో మోసగాళ్ల మనుషులే ఎక్కువ మంది ఉంటారు.
*చిన్న లాభాలతో ఎర
బాధితుడితో మొదట రూ.10,000 లేదా రూ.20,000 పెట్టుబడి పెట్టించి, రెండు రోజుల్లోనే దానికి లాభం కలిపి రూ.15,000 వాళ్ల ఖాతాకు జమ చేస్తారు. దీంతో బాధితుడికి వారిపై నమ్మకం కుదురుతుంది. ఆ నమ్మకంతో బాధితుడు లక్షల్లో, కోట్లలో పెట్టుబడి పెడతాడు.
యాప్‌లో లేదా వెబ్సైట్లో తన అకౌంట్ బ్యాలెన్స్ కోట్లలో పెరుగుతున్నట్లు చూపిస్తారు. కానీ, ఆ డబ్బును విత్ డ్రా (క్యాష్ చేసుకునేందుకు) ప్రయత్నించినప్పుడు.. ట్యాక్స్‌లు, కమిషన్ల పేరుతో మరింత డబ్బు కట్టమంటారు. చివరికి ఆ వెబ్సైట్ లేదా యాప్‌ను క్లోజ్ చేసి పరారవుతారు.
*మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు టెలిగ్రామ్‌లో ఓ ట్రేడింగ్ యాప్ లింక్ వచ్చింది. మొదట రూ. 50 వేలు పెడితే లక్ష వచ్చిందని నమ్మారు. దీంతో రిటైర్మెంట్ కోసం దాచుకున్న రూ. 40 లక్షలను ఆ యాప్‌లో పెట్టాడు.
అకౌంట్లో రూ. 2 కోట్లు చూపించింది. విత్ డ్రా చేద్దామంటే మరో రూ. 10 లక్షలు ట్యాక్స్ కట్టమన్నారు. అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
కూర్చొని పని చేసుకునే పార్ట్‌టైమ్ జాబ్ వెతుకుతున్న ఓ గృహిణికి యూట్యూబ్ వీడియోలకు లైకులు కొట్టే చిన్న టాస్క్ ఇచ్చి డబ్బులు వేశారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో ప్రాఫిట్ వచ్చే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లోకి లాగారు. భర్త దాచుకున్న నగలు కుదువపెట్టి మరీ ఆమె రూ. 15 లక్షలు పోగొట్టుకుంది.
హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్‌లో ఒక లింక్ వచ్చింది. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఒక ప్రఖ్యాత కంపెనీ ఐపీఓలో ప్రత్యేక కోటా కింద షేర్లు ఇస్తామని, తద్వారా తక్కువ సమయంలోనే డబుల్ ప్రాఫిట్ వస్తుందని నమ్మించారు.
వారు ఇచ్చిన ఒక ప్రత్యేక లింక్ ద్వారా ఆ వ్యక్తి రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆన్లైన్ డాష్‌బోర్డ్‌లో అతనికి కోట్లలో ప్రాఫిట్ చూపించారు. కానీ ఆ డబ్బును విత్ డ్రా చేసుకోబోతే, మరింత ట్యాక్స్ కట్టాలని డిమాండ్ చేశారు. చివరకు అది ఫేక్ యాప్ అని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
*తస్మాత్ జాగ్రత్త
సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులు చెప్పే ట్రేడింగ్ టిప్స్, గ్యారెంటీ రిటర్న్స్ మాటలను నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. పెట్టుబడుకలు సెబీ లేదా రిజర్వ్ బ్యాంక్ గుర్తించిన అధీకృత ప్లాట్‌ఫామ్‌లనే వాడాలన్నారు.
ఎవరో పంపిన లింక్‌ల ద్వారా ఎప్పుడూ యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయచ్చు.. లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
