Airtel Second Headquarters in Hyderabad
* హైదరాబాద్‌కు ఎయిర్టెల్ రెండో హెడ్‌క్వార్టర్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మంగళవారం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో భవిష్యత్ పెట్టుబడులు, సంస్కరణలపై ఇరుపక్షాల మధ్య అత్యంత కీలక చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యా, పారిశ్రామిక రంగాలలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సునీల్ మిట్టల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళన, యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’, ఐటీఐలను ఆధునిక సాంకేతికతతో ‘అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs)’గా మార్చడం, అలాగే పాలిటెక్నిక్ కాలేజీల ఆధునికీకరణ వంటి అంశాలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు.
* సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు..
డేటా సెంటర్ల విస్తరణ: చందన్వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం సూచించారు. అంతేకాకుండా, తెలంగాణలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు.
టెక్నాలజీ హబ్: హైదరాబాద్‌లో ఎయిర్టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, AI కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ప్రత్యేక అధికారి నియామకం: భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకునేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
* విద్యార్థులకు భారతీ ఫౌండేషన్ స్కాలర్షిప్లు..
ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సునీల్ భారతి మిట్టల్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ విద్యా సంస్కరణలను అభినందించిన ఆయన.. భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా, హైదరాబాద్ నగరాన్ని ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్‌క్వార్టర్‌గా పరిగణిస్తున్నామని సునీల్ మిట్టల్ ఈ సందర్భంగా వెల్లడించడం విశేషం. రాష్ట్రంలో డేటా సెంటర్ల కెపాసిటీని మరింత పెంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఫైబర్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీతో రాబోయే రోజుల్లో తెలంగాణకు మరిన్ని ఐటీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
