Telangana Water Rights Telangana Water Disputes
* తెలంగాణ నీటి హక్కులపై రౌండ్ టేబుల్ మీటింగ్
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రముఖులు డిమాండ్ చేశారు. ఈమేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, జలవనరుల నిపుణుడు వి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
* కాళేశ్వరంపై తగిన నిర్ణయం తీసుకోవాలి..
ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. గోదావరి తెలంగాణకు జీవనాడి అని, పూర్తి నీటిని వాడుకునే హక్కు మనకు ఉందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై తగిన నిర్ణయం తీసుకోవాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. మరోవైపు, జలవనరుల నిపుణుడు వి. ప్రకాష్ కృష్ణా జలాల తరలింపుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
* మళ్లీ ఉద్యమించాల్సిందే..
జూరాల నుంచి వందల టీఎంసీల నీరు తరలిపోతున్నా, పక్కనే ఉన్న గద్వాల ప్రాంతానికి సాగునీరు అందకపోవడాన్ని వక్తలు తప్పుబట్టారు. పాలమూరు ప్రాంతానికే కృష్ణా జలాలపై తొలి హక్కు ఉందని, నీటి హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులు, రైతులు, ప్రజా సంఘాలు అంతా కలిసి మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.
* తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ..
ఇక ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. కుల గణన జరగాలని, ఓబీసీలకు తగిన ప్రాధాన్యం దక్కాలని అన్నారు. నాగార్జున సాగర్ నిర్వహణలోనూ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, నీటి విడుదలపై రాష్ట్రానికి సరైన నియంత్రణ లేకపోవడం వల్ల ఎడమ కాలువ కింద రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
