* బస్సులోనే ప్రాణాలు విడిచిన మహిళ
* హైదరాబాద్ వరకూ వచ్చేసి తణుకు వెళ్తుండగా విషాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బతుకుదెరువు కోసం మస్కట్(MUSCUT) వెళ్లిన ఓ మహిళ పడరాని పాట్లు పడి.. ఆ వేధింపులు తాళలేక స్వస్థలానికి తిరిగొస్తూ మరణించింది. హైదరాబాద్(HYDERABAD) నుంచి తణుకు(TANUKU) వెళ్తుండగా బస్సులోనే గుండెపోటుతో మృతిచెందింది. ఏపీలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంతా సత్యపద్మ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భర్తకు చేదోడువాదోడుగా ఉండటానికి మస్కట్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బుతో పాటు.. మరికొంత అప్పు తీసుకొచ్చి మొత్తం 2 లక్షల రూపాయలను విజయవాడకు చెందిన ఓ మహిళా ఏజెంట్‌కు ఇచ్చింది. ఆ తర్వాత ఏజెంట్ ఆమెను మస్కట్ పంపించింది. కానీ మస్కట్‌కు వెళ్లిన తర్వాత పని అనుకున్నట్లుగా లేదు. అక్కడి యజమానులు సత్య పద్మ(SATYA PADMA)ను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. పనిఒత్తిడితో ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఇంటికి వెళ్లిపోతానని ఆమె అక్కడి యజమానులకు మొరపెట్టుకుంది. ఏజెంట్‌ను కూడా ఎంతగానో బతిమిలాడుకుంది. కానీ ఎవరూ వినిపించుకోలేదు. మరో రెండు లక్షలు ఇస్తేనే ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దీంతో ఏపీలో ఉన్న భర్త ప్రభాకర్ ఏజెంట్‌కు రెండు లక్షలు చెల్లించాడు. ఏజెంట్‌కు డబ్బులు పంపించిన తర్వాత తన భార్య వారం రోజుల్లో ఇంటికి వస్తుందని ఆశపడ్డాడు. ఈ నెల 24వ తేదీన మస్కట్(MUSCUT) నుంచి పద్మ ఇండియా(INDIA)కు బయల్దేరింది. మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. అక్కడ తణుకు వెళ్లే బస్సు ఎక్కింది. కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించి ఉండటంతో గుండెపోటుకు గురై బస్సులోనే కన్నుమూసింది. ఈ నెల 30న పంపిస్తామని చెప్పి 24వ తేదీనే పంపించేశారని తెలిపారు. ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా తమకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
—————————————–