Thorrur Gurukulam
* కట్టెలు కొడుతూ గాయపడిన విద్యార్థి
ఆకేరు న్యూస్, తొర్రూరు : విద్యార్థుల చదువులు, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వంట, ఇతర పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో సిబ్బంది విద్యార్థులతో వంటకు సంబంధించిన పనులతో పాటు ఇతర పనులు చేయిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ఓ విద్యార్థితో కట్టెలు కొట్టించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విద్యార్థికి గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం సదరు విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
విద్యార్థులతో కట్టెలు కొట్టించడం, వంట పనులు చేయించడం వంటి చర్యలు ఎంతవరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంటుంది. అయితే విద్యార్థులతో ఇలాంటి పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో పాఠశాల నిర్వహణ తీరుపై తల్లిదండ్రులు, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థులతో పనులు చేయించిన సిబ్బంది ఎవరు? ఎందుకు చేయించారు? ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం, సంబంధిత అధికారులు ఏ చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి పూర్తి వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం జరిగితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
