* రష్యాలో ప్రమాదం.. 70 మందికిపైగా గాయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : బ్రడ్జిపై నుంచి వెళ్తూ.. ఓ రైలు పట్టాలు తప్పింది. దీంతో కొన్ని బోగీలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 70 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడి మీడియాలోని కథనాల ప్రకారం.. వోర్కుటా నగరం నుంచి ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా.. రష్యా దేశంలోని దక్షిణాన నల్ల సముద్రంలోని నోవోరోసిస్క్ నౌకాశ్రయానికి రైలు వెళ్తోంది. కోమి రిపబ్లిక్లోని ఇంటా అనే చిన్న పట్టణం సమీపంలోకి రాగానే రైలు పట్టాలు తప్పింది. దీంతో 9 బోగీలు కోమి నదిలోకి పడిపోయాయి. ప్రమాద సమయంలో రైలులో 215 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 70 మంది గాయపడినట్లు తెలిసింది. క్షతగాత్రుల్లో ఏడుగురికి తీవ్రమైన గాయాలైనట్లు స్థానిక మీడియా నివేదించింది. ప్రమాద సమయంలో నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.