
సీఎం రేవంత్ రెడ్డి
* బీఆర్ ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే
* పజ్జన్న ఇజ్జత్ తీయడానికే పోటీలో పెట్టింన్రు
* కేంద్రంలో కాంగ్రెస్ రాబోతోంది
* దానాన్ని గెలిపిస్తే కేంద్రంలో పెద్ద పదవి
* సికింద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత బెయిలు కోసం సికింద్రాబాద్ సీటును కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కిషన్‌రెడ్డిని గెలిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పజ్జన్న ఇజ్జత్ తీయడానికి ఆయనను ఇక్కడ పోటీకి పెట్టారని తెలిపారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్, కేసీఆర్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ కేసీఆర్‌పైన, మోదీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ మంత్రిగా చేసిన కేటీఆర్, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ నగరానికి ఏం చేశారో చెప్పాలని, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రో ఎవరు తెచ్చారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ లో ఎవరు ఎంపీగా ఉంటే కేంద్రంలో వారిదే అధికారమని, ఇక్కడ దానం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని వెల్లడించారు. దానం నాగేందర్ ను గెలిపిస్తే.. కేంద్రంలో పెద్ద పదవి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పారు.
పద్మారావుకు కేసీఆర్ సహకారం లేదు..
సికింద్రాబాద్‌లో బీజేపీని గెలిపించడానికే ఇక్కడ పద్మారావును నిలబెట్టారని రేవంత్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు పద్మారావుకు సహకరించడం లేదని తెలిపారు. దీన్ని బట్టే ఈ సీటు బీజేపీకి బీఆర్ ఎస్ తాకట్టు పెట్టినట్లు అర్థం అవుతోందని తెలిపారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి కనీసం నలుగురు కూడా వెంట రాలేదని అన్నారు. బిడ్డ బెయిలు కోసం పజ్జన్న ఇజ్జత్ తీస్తున్నారని విమర్శించారు. పద్మారావును ఓడించడం ద్వారా కిషన్‌రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ చూస్తున్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని తెలిపారు.
సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలి
బస్తీలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉండాలని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణించాలన్నా, 500కే గ్యాస్ రావాలన్నా కాంగ్రెస్ గెలవాలని, ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత నాదని ప్రజలకు హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రెండు స్కై వేల కోసం కేంద్రాన్ని ఒప్పటించి 194 ఎకరాలను తీసుకొచ్చానని తెలిపారు. ఈ నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. అధిష్టాన పెద్దలను ఒప్పించి అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యభ సభ్యుడిని చేసుకున్నామని, లోక్ సభ సభ్యుడిగా దానం ఉంటే తనకు కుడి, ఎడమ భుజాలుగా ఉంటారని తెలిపారు.
మోదీ మాయలో పడకండి
ప్రధాని మోదీ ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారని, పదేళ్లలో పది లక్షల ఇవ్వాలని ఇచ్చాడా అని ప్రజలను ప్రశ్నించారు. నల్లధనం వెనక్కి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు. జంట నగరాలు వరదల్లో మునిగితే కిషన్ రెడ్డి, మోదీ పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీ ఓళ్లు మతతత్వ చిచ్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. అని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ వస్తే ఆస్తులు లాక్కుంటారని మోదీ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
———————————————————-