* అసలు పడగవిప్పే పాములు.. పగబడతాయా?
* వికాస్ దూబేకు 2 నెలల్లో 5 కాట్లు పగా.. యాదృచ్చికమా?
ఆకేరు న్యూస్ డెస్క్:
ఇటీవల జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్‌మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. అదేంటంటే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన వికాస్‌దూబే (Vikasdubey) రెండు నెలల్లో ఏకంగా ఐదుసార్లు పాముకాటుకు గురయ్యాడు. జూన్ 2న రాత్రి ఇంట్లో తొలిసారి అతడిని పాము కాటేసింది. కుటుంబసభ్యులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించడంతో కోలుకున్నాడు. అదే నెల పదో తారీఖున మరోసారి అతడు పాముకాటు (Snake Bite) బారినపడి బతికిబయటపడ్డాడు. దీంతో ఆచితూచి అడుగులు వేసేవాడు. అయినప్పటికీ.. మరో వారం రోజులకు మళ్లీ అతడిని పాము కాటేసింది. ఈసారి కాస్త సీరియస్ అయింది.
ఆ ఘటన మరువక ముందే..
కొన్ని రోజులకే మళ్లీ పాము కాటేసింది. అదే ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లిన వికాస్‌దూబేను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఒకేవ్యక్తి ఇన్నిసార్లు పాముకాటుకు గురికావడం ఏంటో వారికి కూడా అర్థం కాలేదు. వైద్యుల, బంధువుల సలహా మేరకు దూబే (Dubey) ను కుటుంబ సభ్యులు సొంత ఇంటికి దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్న అతడి అత్తయ్య ఇంటికి తరలించారు. దురదృష్టం ఏంటంటే.. అతడు అక్కడ కూడా పాము కాటుకు గురయ్యాడు. వికాస్ ను పదే పదే కాటేస్తోంది ఒకే పామా.. లేక వేర్వేరా అనేది తెలియలేదు. కానీ.. అతడు మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. ఎందుకిలా జరిగింది.. ఒకే వ్యక్తి ఇన్నిసార్లు పాముకాటుకు గురికావడం ఏంటి? అయినా బతకడం వికాస్ అదృష్టం.. అనే చర్చలు, ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాముపగ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అది సినిమాల్లోనే అంటున్న వైద్యులు
పాము పగ ఆధారంగా కొన్ని సినిమాలు వచ్చాయి. తమకు పాలుపోసి పూజిస్తున్న కుటుంబానికి ఆపద తలపెట్టిన వారిని, లేదా తమకే హాని చేసిన వారిని పగబట్టి మరీ చంపినట్లుగా ఆయా సినిమాల్లో చూపించారు. వాస్తవంలో పాములు పగ పట్టవని, వాటికి జ్ఞాపకశక్తి చాలా తక్కువ అని వెటర్నరీ వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తు పెట్టుకుంటాయి. అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకోవు. నిజానికి చాలా వరకూ పాములు పుట్ట నుంచి బయటకొచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. నిజానికి పాములు ఎప్పుడూ కావాలని మనుషుల మీద దాడి చేయవు. అవి ఎదురైనప్పుడు వాటికి దూరంగా వెళ్లిపోతే అవి కూడా వాటి దారిలో వెళ్లిపోతాయి. కానీ, తమకు ప్రమాదం కలుగుతుందన్న భావన కలిగిస్తే అవి ప్రాణ రక్షణ కోసం బుసలు కొడతాయి, లేదా కాటు వేస్తాయి. అంతే తప్ప… పాములు పగబట్టి ప్రాణాలు తీస్తాయన్నది కేవలం మూఢ నమ్మకం అంటున్నారు శాస్త్రవేత్తలు. వికాస్ దూబే కు పాము కాట్లు యాదృచ్చికమే అని కొట్టి పారేస్తున్నారు.
పాము కాటు వేస్తే ఏం చేయాలి
పాము కాటు వేసిందని ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి, తక్షణమే వైద్య చికిత్స పొందాలి.
శరీరంలో కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు కదిలించకుండా ఉంచాలి. నగలు, వాచీల వంటి వాటిని తొలగించాలి. దుస్తులను వదులు చేయాలి.. కానీ విప్పేయవద్దు.
ఏం చేయకూడదంటే..
పాము కాటు ప్రాంతం నుంచి విషాన్ని నోటితో లాగటం చేయకూడదు. పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయవద్దు. కాటు వేసిన ప్రాంతం నుంచి రక్తప్రసరణను నిలిపివేస్తూ కట్టుకట్టటం వంటివి చేయరాదు. అలా చేయటం వల్ల విషం వ్యాపించకుండా ఆగకపోగా.. వాపు మరింత విషమించటానికి, ఆ అవయవం తొలగించాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు.
—————————-