Warangal Collector Satya Sarada Model Solar Village
ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమం కింద బుధవారం ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. లబ్ధిదారుల ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను సందర్శించి, పనుల పురోగతిపై తెలంగాణ రెడ్కో మరియు విద్యుత్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మిగిలిన లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మెటీరియల్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చి పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి గృహజ్యోతి వినియోగదారుని ఇంటిపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రతి ఇంటికి నెలకు సుమారు 240 నుంచి 250 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, స్వీయ వినియోగం అనంతరం మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు పంపించడం ద్వారా లబ్ధిదారులు అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని వివరించారు.
సోలార్ విద్యుత్ వినియోగం వల్ల విద్యుత్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు, సంప్రదాయ ఇంధన వనరుల సంరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, పోతిరెడ్డిపల్లి గ్రామాన్ని వరంగల్ జిల్లాలో ఆదర్శ మోడల్ సోలార్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీ రామిరెడ్డి, టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ శ్రీ రాజేందర్, రాయపర్తి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాసులు, టీజీ రెడ్కో ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ నవీన్ కుమార్ యాదవ్, విద్యుత్ శాఖ ఏఈ మరియు సిబ్బంది, పోతిరెడ్డిపల్లి, గ్రామ సర్పంచ్ లాకావత్ రెడ్యానాయక్.కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ కొండం రంగారెడ్డి,పంచాయితీ కార్యదర్శి దయాకర్, గ్రామపంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
