Devaruppula
Devaruppula| ఆకేరు న్యూస్, దేవరుప్పుల: తెలుగు భాషపై మమకారాన్ని పెంపొందిస్తూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక రచనా ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సౌదామని సాహిత్య సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ పోటీలను నిర్వహించారు. సౌదామని సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చింత ప్రసాద్ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఆధునిక కాలంలో తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై పోటీ నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థులు తెలుగు భాష వైభవం, సాహిత్య ప్రాధాన్యత, ఆధునిక సమాజంలో మాతృభాష అవసరం, తెలుగు భాష అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను తమ వ్యాసాల్లో ప్రతిబింబించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
విజేతలు వీరే..
ప్రథమ బహుమతి: ముత్యం సాత్విక – 10వ తరగతి, శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్, దేవరుప్పుల
ద్వితీయ బహుమతి: భౌరోజు సాత్విక – ఎంపీసీ ద్వితీయ సంవత్సరం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, దేవరుప్పుల
తృతీయ బహుమతి: చింతకింది హనీష్ – 10వ తరగతి, శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్, దేవరుప్పుల
ఈ సందర్భంగా అతిథులు, కవులు, రచయితలు, కళాకారులు, గాయకులు మాట్లాడుతూ తెలుగు భాష కేవలం సంభాషణకు మాత్రమే పరిమితం కాదని, తరతరాల సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు మాతృభాషను ప్రేమిస్తూ చదవడం, రాయడం, సృజనాత్మకంగా వ్యక్తీకరించడం ద్వారా తెలుగు భాషను భావితరాలకు మరింత బలంగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్, సౌదామని సాహిత్య సంస్థ ఉపాధ్యక్షులు అంకాల సోమయ్య, జనగామ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు నక్క సురేష్, పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యపు విజేందర్, అయిలా సోమనరసింహచారి, బోనగిరి పూర్ణచందర్, కళాశాల అధ్యాపకులు అనంతచారి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సంస్థ ప్రధాన కార్యదర్శి జోగు సుదర్శన్, జోగు మధు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
