Warangal MGM Hospital
* మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు గాయాలు
ఆకేరు న్యూస్ వరంగల్ : వరంగల్‌లోని మహాత్మా గాంధీ స్మారక ప్రభుత్వ వైద్యాశాల (ఎంజీఎం) ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యాశాలలోని వివిధ విభాగాలలో వరుసగా పైకప్పు పెచ్చులు ఊడిపడటం, రోగులు గాయపడుతున్న ఘటనలపై ఆరా తీసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రభుత్వ ప్రధాన విప్, వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు ప్రధాన ద్వారం వద్దే నిరోధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
* వరుస ప్రమాదాలు – బాధితుల ఆవేదన..
ఆదివారం రోజున వైద్యాశాలలోని ఆరోగ్యశ్రీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో పలువురు రోగులు, సహాయకులు గాయపడిన ఘటన మరువకముందే, తాజాగా శ్వాసకోశ తీవ్ర సంరక్షణ విభాగంలో (RICU) కూడా పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. వరుస ప్రమాదాలతో చికిత్స పొందుతున్న బాధితులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆపదలో ప్రాణ రక్షణ కల్పించాల్సిన వైద్యాశాల భవనాలే ప్రమాదకరంగా మారాయని బాధితులు కన్నీరుమున్నీరవుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* దాస్యం వినయ్ భాస్కర్‌కు గాయాలు..
ఈ ప్రమాద విషయం తెలుసుకుని పరిశీలనకు వచ్చిన దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఆస్పత్రి లోపలికి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్‌కు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకులు వైద్యాశాల ద్వారం వద్దే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
* పాలనా వైఫల్యంపై నిలదీత..
గాయపడినప్పటికీ నిరసనను కొనసాగించిన దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే ప్రభుత్వ విధానమా అని నిలదీశారు. బాధితుల ఆవేదనను పట్టించుకోకుండా, పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన తమపై దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. నిత్యం వేలాది మంది పేద రోగులు వచ్చే వైద్యాశాలలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. తక్షణమే వైద్యాశాల భవనాలకు మరమ్మతులు చేపట్టి, రోగులకు సురక్షితమైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
