* అప్పుకు జామీనుగా ఉన్న మహిళ హత్య
* కుమారుడి కళ్లెదుటే దారుణం
* ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్ ఘాతుకం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ‘అంకుల్.. అంకుల్.. అమ్మను ఏమీ చేయొద్దు. చంపొద్దు అంకుల్. వదిలేయండి ప్లీజ్..’ అంటూ మొత్తుకుంటున్న కుమారుడి కళ్లెదుటే మహిళను కత్తితో పొడిచి చంపేశాడు. సోదరుడికి అప్పు ఇప్పించిన పాపానికి ఆమె బలైపోయింది. ఆ బిడ్డకు తల్లి లేకుండా పోయింది. హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఠాగూర్ విజయలక్ష్మి(40) శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల లక్ష్మీవిహార్ ఫేజ్-1లో నివాసం ఉంటోంది. ఆమె భర్త కూలీగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు రాహుల్‌సింగ్ టెన్త్ పాసైయ్యాడు. రెండో కుమారుడు కార్తీక్ 8వ తరగతి చదువుతున్నాడు. విజయలక్ష్మి ఇళ్లల్లో పనిచేస్తోంది. పని ప్రదేశానికి రాకపోకల సమయంలో ఆటోడ్రైవర్ భరత్‌గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. భరత్ ఫైనాన్స్ కూడా చేస్తుంటాడు. విజయలక్ష్మికి అవసరం ఉన్నప్పుడు పలుమార్లు డబ్బు అప్పు ఇచ్చేవాడు. విజయలక్ష్మి తిరిగి ఇచ్చేది. విజయలక్ష్మి తమ్ముడు సునీల్సింగ్కు ఫైనాన్స్‌పై భరత్ రెండు ఆటోలను ఇప్పించాడు. దానికి విజయలక్ష్మి జామీనుగా ఉంది. సునీల్‌సింగ్ డబ్బులు సరిగా చెల్లించడం లేదని గొడవలు మొదలయ్యాయి. డబ్బులు చెల్లించినప్పటికీ భరత్ గౌడ్ ఇబ్బందులు పెడుతున్నాడని సునీల్‌సింగ్ కొల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సంగారెడ్డి కోర్టులో ఇటీవల జరిగిన లోక్ అదాలత్‌లో కేసు రాజీ అయింది. అయినప్పటికీ లక్ష్మీవిహార్లోని విజయలక్ష్మి ఇంటికి వచ్చిన భరత్‌గౌడ్ వెళ్లాడు. అతడిని చూసిన విజయలక్ష్మి ఇక్కడికి ఎందుకువచ్చావ్ వెళ్లిపోవాలని చెప్పడంతో భరత్‌గౌడ్ కోపంతో ఊగిపోయాడు. తలుపులు తీసి విజయలక్ష్మి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వెనుక నుంచి భరత్‌గౌడ్ కత్తితో మెడపై పొడిచాడు. దీంతో ఆమె చనిపోయింది. ఇదంతా విజయలక్ష్మి కుమారుడు రాహుల్ కళ్ల ముందే జరిగింది. తల్లిని ఏమీ చేయవద్దని రాహుల్ వేడుకున్నా భరత్‌గౌడ్ వినకుండా కత్తితో పొడిచాడు. ఆపే ప్రయత్నంలో రాహుల్ చేతులకు గాయాలు అయ్యాయి. విజయలక్ష్మి అక్కడే చనిపోవడంతో ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే రాహుల్‌ను కూడా చంపేస్తానని బెదిరించి తలుపులకు గొళ్లెం పెట్టి వెళ్లిపోయాడు. భరత్‌గౌడ్ వెళ్లిన తర్వాత రాహుల్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు.
————————