* తొమ్మిది అంశాలు కీలకంగా రూపకల్పన
* ఉన్న పథకాలు కొనసాగింపు.. నిధుల పెంపు
* అమ్మ ఒడికి 15 వేల నుంచి 17 వేలు
* సున్నా వడ్డీ పథకం మరో ఐదేళ్లు
* పెన్షన్ 3,500కు పెంపు
* రైతు భరోసా 13,500 నుంచి 16000కు
* ఈసారి కూడా రెండు పేజీలతో మేనిఫెస్టో
* విడుదల చేసిన వైసీపీ అధినేత జగన్
ఆకేరు న్యూస్, తాడేపల్లి : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలతో పార్టీ మేనిఫెస్టో శనివారం విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేశామన్నారు. ఇతర పార్టీల్లాగా అలవికాని హామీలు, ఆచరణ సాధ్యం కాని పథకాలకు తమ మేనిఫెస్టోలో చోటు లేదన్నారు జగన్. అక్కాచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, రైతులకు, కార్మికులు, యువత, విద్యార్థులకు మేనిఫెస్టోలో సమాన ప్రాధాన్యత కల్పించామన్నారు. ప్రధానంగా 9 అంశాలపై ఫోకస్ చేస్తూ మేనిఫెస్టో రూపొందించారు. ఉన్న పథకాలకు కొనసాగిస్తూ, ఇచ్చే నిధులను పెంచుతూ, సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు జగన్ వెల్లడించారు. రైతు భరోసా కింద ఇచ్చే సాయం 13,500 నుంచి 16000కు పెంచుతామన్నారు. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధులను పెంచారు. అలాగే యువతకి ఉపాధి అవకాశాలపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. ఇప్పటి వరకు 2.31 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాలకు ఏడాదికి రూ. 70 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. వాలంటీర్ల ద్వార ఇంటికే పథకాలు అందించామన్నారు. ఎమ్మెల్యేలను గడపగడపకు పంపించామన్నారు.
58 నెలల్లో 99 శాతం హామీల అమలు
గత 58 నెలల కాలంలో 99 శాతం హామీలను అమలుచేసి కాలర్ ఎగురవేసి సగర్వంగా ప్రజల వద్దకు వెళ్తానన్నారు. జగన్ ఇచ్చే పథకాలు ఆపడం ఎవరి తరమూ కాదని చెప్పారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంధమని, దేశచరిత్రలో ఈ 58 నెలలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. 2.70 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందజేశామని వెల్లడించారు. కొవిడ్ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనా.. సాకులు చెప్పకుండా పథకాలు కొనసాగించినట్లు వివరించారు. సామాజిక న్యాయం పాటిస్తూ పాలన సాగించామని, 200 సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 100 సీట్లను ఇచ్చామని చెప్పారు.
టీడీపీది చీటింగ్
ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. గతంలో ఉన్న రుణమాఫీ, డ్వాక్రా రుణాలను చంద్రబాబు ఎగ్గొట్టారన్నారు. సింగపూర్ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రతీ నగరంలోనూ హైటెక్ సిటీ లాంటివి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకువస్తామని అబద్ధాలు చెప్పారన్నారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ వెటకారంగా మాట్లాడారు. విశ్వసనీయత లేనప్పడు రాజకీయాలు చేయడం ఎందుకు? రాజకీయ నాయకుడంటే.. తాను చనిపోయాక ప్రతీ ఇంట్లో తన ఫొటో, పేదవాడి గుండెల్లో మనం ఉండాలనే తాపత్రయం ఉండాలని సీఎం జగన్ అన్నారు. టీడీపీ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సాధ్యమా అని ప్రశ్నించారు. వాటికి ఏటా లక్షా 21 వేల కోట్లు అవసరం అని చెప్పారు.
————————