ఆకేరున్యూస్, హైదరాబాద్: జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన కోర్టు.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు గత నెల 23న కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగిందని.. ఈ దాడికి బహిరంగంగా సదరు జర్నలిస్టుకు క్షమాపణలు కూడా చెప్పారని వెల్లడిరచారు. జర్నలిస్టులు బలవంతంగా ఇంట్లోకి వచ్చారని, కావాలని దాడి చేయలేదని కోర్టుకు తెలియజేశారు.
మోహన్ బాబు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్దంగా ఉన్నారని కోర్టుకు నివేదించారు. అయితే ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా..? అంటూ మోహన్ బాబును కోర్టు ప్రశ్నించింది. మరోవైపు జర్నలిస్ట్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. దాడి వల్ల ఐదు రోజులు ఆస్పత్రిలో ఉన్నారని..సర్జరీ జరుగడంతో నెల రోజులపాటు పైపు ద్వారానే ఆహారాన్ని తీసుకున్నట్టు కోర్టుకు తెలిపారు. జర్నలిస్టుపై దాడి చేయడమే కాకుండా కించపరిచారన్నారు. అతనికి కెరియర్ పరంగా కూడా నష్టం జరిగిందని చెప్పారు. అయితే కోర్టు ఈ ఘటనలో నష్టపరిహారం కావాలా..? జైలుకు పంపాలా అని జర్నలిస్ట్ తరపు న్యాయవాదులను అడిగింది. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణలో తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది.
………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
