– హైదరాబాద్‌లో మార్పులకు అదే కారణమా?
– తాజాగా హైడ్రాకు కీలక బాధ్యతలు
– అత్యవసర పనుల నిర్వహణ నుంచి జీహెచ్ఎంసీ ఔట్
– ఇప్పటికే పలు అత్యవసర టెండర్లు రద్దు
– తాజాగా భారీ మార్పులు
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లేఖ ఎఫెక్ట్ అంటూ చర్చ
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి:
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని వెనుక ఆసక్తికర పరిణామాలూ ఉన్నాయి. ‘అత్యవసర పనుల టెండర్లలో గోల్మాల్ జరుగుతోంది. ఒక కంపెనీకి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోంది’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. అప్పటి నుంచి జీహెచ్ఎంసీలో కీలక మార్పులు జరుగుతున్నాయి. అత్యవసర టెండర్లను రద్దు చేశారు.. అంటూ కవితను కాంట్రాక్టర్లు పూలమాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తాజా నిర్ణయాలకు కూడా జీహెచ్ఎంసీలో జరుగుతున్న అవినీతితో పాటు, కవిత లేఖే కారణమన్న ప్రచారం జరుగుతోంది.
హైడ్రాకు మరిన్ని బాధ్యతలు
ప్రతిపక్షనేతలు పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, ఆందోళనలు, లేఖలు రాయడం సాధారణమే. అయితే ప్రభుత్వం అంతగా వాటిని పట్టించుకోదు. తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతుంది. అయితే, జీహెచ్ఎంసీలో జరుగుతున్న అవినీతికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం, అనంతరం కొన్ని మార్పులు జరగడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కారు వర్షాకాల అత్యవసర/తక్షణ మరమ్మతు బృందాల ఏర్పాటు, బాధ్యతలు హైడ్రాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ రవాణా విభాగంలో అవినీతి, అక్రమాల నేపథ్యంలో సర్కారు కీలక అదేశాలు జారీ చేసింది.
కవిత లేఖతో కాంట్రాక్ట్ రద్దు?
వర్షాకాలం నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో వరద తొలగింపు, సహాయక చర్యలు, గాలి, వానకు కూలిన చెట్లు, కొమ్మల తొలగింపు, రహదారుల మరమ్మతు కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తోంది. డివిజన్‌కు ఒకటి చొప్పున 150 బృందాల ఏర్పాటుకు గతంలో డివిజన్ల వారీగా సర్కిల్ స్థాయిలో టెండర్ నోటిఫికేషన్ ప్రకటించేవారు. అయితే ఈ సారి టెండర్ ప్రకటనకు ముందే తమకు సన్నిహితంగా ఉండే రెండు, మూడు సంస్థలకు రవాణా విభాగంలోని అధికారులు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆ కాంట్రాక్టర్లు డీలర్లతో ముందుగా ఎంఓయూ కుదుర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ సంస్థలకే పనులు దక్కాయి. దీనిపై పత్రికల్లో కథనాలు, సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ, కాంట్రాక్టర్ల అభ్యంతరం నేపథ్యంలో టెండర్ల విషయంలో బల్దియా పునరాలోచనలో పడింది. దీంతో కాంట్రాక్టర్లు కొద్దిరోజుల క్రితం కవిత సత్కరించారు.
మరో సంచలన నిర్ణయం
మహానగరంలో వర్షాకాల అత్యవసర కార్యకలాపాలు, వరద నీరు, విపత్తుల నిర్వహణ బాధ్యతలు హైడ్రాకు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న వరద నీటి నిర్వహణ, విపత్తుల సన్నద్ధత బాధ్యతలను ఇక మీదట హైడ్రా చూసుకుంటుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. వర్షాకాలంలో క్యాచ్పిట్ల వద్ద చెత్తాచెదారం తొలగింపు, రహదారులు, ఇతరత్రా ప్రాంతాల్లో నిలిచిన వరద నీటిని మోటార్ పంపులతో తొలగించడం, అవసరమైన చోట వాహనాల రాకపోకల మళ్లింపు వంటి పనులు హైడ్రా చూసుకోనుంది. వర్షాకాల అత్యవసర/తక్షణ మరమ్మతు బృందాల ఏర్పాటుకు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రకటించిన టెండర్ నోటిఫికేషన్లో అవకతవకలతో పాటు, వాటిని ఎత్తిచూపుతూ కవిత లేఖ రాయడంతోనే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ప్రచారం జరుగుతోంది.
………………………………………………..
