Monsoon Electrical Safety Tips
* విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
* ఏదైనా ప్రమాదం ఎదురైతే TGNPDCL టోల్ ఫ్రీ నంబర్ 1912
* ములుగు– సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి
ఆకేరు న్యూస్, ములుగు :
వర్షాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ములుగు సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.బిక్షపతి తెలిపారు. విద్యుత్ మన జీవితానికి వెలుగు నిచ్చే అమూల్యమైన శక్తి అయినప్పటికీ, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.ఏదైనా విద్యుత్ ప్రమాదం లేదా లోపం గమనించిన వెంటనే TGNPDCL టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
గృహ వినియోగదారులు, రైతులు, పశువులకాపలాదారులు, విద్యార్థులు ,ప్రజలందరూ ఈ క్రింది విద్యుత్ భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
* ఇవే సూచనలు
• వర్షం కురుస్తున్న సమయంలో తడిసిన విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు, సపోర్ట్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలు లేదా తడి గోడలకు ఆనుకుని ఉన్న విద్యుత్ ఉపకరణాలను తాకకూడదు.
• తెగిపోయిన, వేలాడుతున్న లేదా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరగా వెళ్లవద్దు, తాకవద్దు.
• ఉరుములు, మెరుపులు సంభవిస్తున్న సమయంలో చెట్ల క్రింద నిలబడకండి. బహిరంగ ప్రదేశాల్లో అవసరం లేకుండా సంచరించవద్దు.
* గృహ వినియోగదారులకు:
• తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్‌లు, మీటర్ బోర్డులు, మోటార్లు, గీజర్లు, కూలర్లు, వాటర్ హీటర్లు లేదా ఇతర విద్యుత్ పరికరాలను తాకరాదు.
• సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా ఫోన్లో మాట్లాడకూడదు. ముందుగా ఛార్జర్‌ను తొలగించిన తర్వాత మాత్రమే వినియోగించాలి.
• ఇంటి వైరింగ్‌కు తప్పనిసరిగా నాణ్యమైన ఎర్తింగ్ చేయించండి.
• ఐఎస్ఐ (ISI) నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యుత్ పరికరాలు, ప్లగ్గులు, వైర్లు, ఛార్జర్లు మాత్రమే ఉపయోగించండి.
• పాడైన, అతుకులు (జాయింట్లు) ఉన్న, ఇన్సులేషన్ దెబ్బతిన్న వైర్లు వెంటనే మార్చించండి.
• ఇంటి విద్యుత్ మరమ్మతులు స్వయంగా చేయకుండా అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్‌తో మాత్రమే చేయించాలి.
* బట్టలు ఆరబెట్టేటప్పుడు..
• ఇనుప (GI) దండెలకు బదులుగా ప్లాస్టిక్ దండెలు ఉపయోగించండి.
• విద్యుత్ సర్వీస్ వైర్లు, మీటర్ బోర్డులు లేదా విద్యుత్ లైన్ల సమీపంలో తడి బట్టలు ఆరబెట్టవద్దు.
• ఇంటి ముందు ఏర్పాటు చేసే రేకులు, ఇనుప నిర్మాణాలు విద్యుత్ వైర్లను తాకకుండా తగిన దూరంలో ఉండేలా చూసుకోండి.
* రైతులకు ప్రత్యేక సూచనలు:
• వ్యవసాయ మోటార్‌ను ఆన్ చేసే ముందు స్టార్టర్, వైర్లు, స్విచ్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలించండి.
• మోటార్లు, స్టార్టర్లు, GI పైపులు, ఫుట్ వాల్వులు, పంపుసెట్లకు తప్పనిసరిగా సరైన ఎర్తింగ్ చేయించండి.
• అతుకులు లేని నాణ్యమైన సర్వీస్ వైర్లు మాత్రమే ఉపయోగించాలి.
• విద్యుత్ మోటార్లు, పైపులు, ఫుట్ వాల్వులు లేదా తడి పరిస్థితుల్లో ఉన్న పరికరాలను నేరుగా తాకవద్దు.
• ట్రాన్స్ఫార్మర్ల వద్ద సొంతంగా ఫ్యూజులు మార్చడం, ఏబీ స్విచ్‌లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలు సరిచేయడం వంటి పనులు చేయరాదు.
• మోటార్ల మరమ్మతులు అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్‌తో మాత్రమే చేయించాలి
• విద్యుత్ లైన్ల క్రింద ఇనుప పైపులు, స్ప్రింక్లర్ పైపులు ఎత్తేటప్పుడు అత్యంత జాగ్రత్త పాటించాలి
• ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడిపేటప్పుడు విద్యుత్ లైన్లకు తగలకుండా చూసుకోవాలి.
• వ్యవసాయ భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయవద్దు. ఇది చట్టవిరుద్ధమే కాక ప్రాణాంతకం కూడా అవుతుంది.
• చేపల వేట లేదా వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించడం తీవ్రమైన నేరం.
• విద్యుత్ లైన్ల క్రింద వ్యవసాయ వ్యర్థాలను కాల్చవద్దు. వేడి కారణంగా లైన్లు తెగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.
* పిల్లల భద్రత కోసం:
• పిల్లలను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ బోర్డులు, స్విచ్ బోర్డుల వద్ద ఆడనివ్వకూడదు
* పశువులకాపలాదారులు :
• పశువులను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు కట్టవద్దు.
• పశువులను మేతకు తీసుకెళ్లేటప్పుడు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి.
* విద్యుత్ షాక్ సంభవించినప్పుడు
• విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తిని నేరుగా చేతులతో తాకకూడదు.
• కర్ర, ప్లాస్టిక్ వంటి విద్యుత్ ప్రసారం చేయని వస్తువులతో బాధితుడిని విద్యుత్ మూలం నుంచి వేరు చేయాలి.
• వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి వైద్య సహాయం అందించాలి.
* కొత్త భవనాల నిర్మాణంలో:
• విద్యుత్ లైన్లకు కనీసం 1.2 మీటర్ల భద్రతా దూరం పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలి.
• అనుమతి లేకుండా విద్యుత్ లైన్లపై ఇనుప కొండీలు వేసి విద్యుత్ చౌర్యానికి పాల్పడటం చట్టరీత్యా నేరం. ఇది ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది.
* ప్రమాదం కనిపిస్తే…
• తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే దగ్గరకు వెళ్లవద్దు.
• విద్యుత్ పరికరాలు లేదా లైన్లలో ఏదైనా లోపం గమనించిన వెంటనే TGNPDCL అధికారులకు సమాచారం ఇవ్వాలి.
—————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
