Agency Areas Heavy Rains
* మత్తళ్ళు దుంకుతున్న చెరువులు
* రాక పోకలకు అంతరాయం
* లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్న అధికారులు
ఆకేరు న్యూస్, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో వర్షం దంచికొడుతోంది. చెరువులు, జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పలు చోట్ల రాక పోకలు స్తంభించి పోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మంగపేట మండలంలోని గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో తిమ్మంపేట పెద్ద చెరువులోకి వర్షపు నీరు చేరడంతో చెరువుకు జలకళ ఏర్పడింది. బుధవారం సాయంత్రం చెరు పూర్తిగా నిండి మత్తడి పడింది. చెరువు ఎగువ భాగములో కుంటలు చెరువులు నిండి మత్తడిపోయ డంతో ఆ నీరు తిమ్మంపేట పెద్ద చెరువులోకి చేరి పూర్తిగా నిండింది. దీంతో ఆ చెరువు జలకళ సంతరించుకుంది. మత్తడి పడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేపల వేట మొదలుపెట్టారు. మంగపేట మండలంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి వరకు కురుస్తున్న వర్షాలతో చెరువులు కుంటలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో అవి మత్తడిలు పడ్డాయి. చెరువులు కుంటలు మత్తడిలు పోస్తుండడంతో ఆయకట్టు రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువుకు గత రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం చెరువు నీటిమట్టం 9 అడుగులకు చేరగా, పూర్తి స్థాయి నీటిమట్టం 16 అడుగులుగా ఉంది. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగితే చెరువు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది.
* సుడిగాలి బీభత్సం..
ములుగు జిల్లా మంగపేట మండలంలో వీచిన సుడిగాలి బీభత్సం సృష్టించింది. సండ్రోని ఒర్రె సమీపంలోని అటవీ ప్రాంతంలో పలు భారీ వృక్షాలు కూకటివేళ్లతో నేలకూలాయి. కోమటిపల్లి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న వృక్షాలు, నీలగిరి చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అలాగే 11 కేవీ విద్యుత్ లైన్‌పై చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఇన్చార్జి ఎఫ్ఆర్వో మహ్మద్ లాయక్ హుస్సేన్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చెట్ల తొలగింపు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
* పర్యాటకులకు నో ఎంట్రీ
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
పర్యాటకులు జలపాతం వద్ద సెల్ఫీలు దిగడం, నీటిలోకి దిగడం, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
* బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ ఓపెన్‌కాస్ట్-2, 3 గనుల్లోకి వరదనీరు చేరింది. గనుల్లో సుమారు 42 శాతం మేర నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బొగ్గు వెలికితీసే యంత్రాలు బురదలో కూరుకుపోవడంతో సుమారు 9 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. కాటారం సబ్‌డివిజన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో బుధవారం అన్నారం–చండ్రుపల్లి మధ్యనున్న లోలెవెల్ వంతెనపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో వంతెన పూర్తిగా మునిగిపోవడంతో కాళేశ్వరం, మద్దెలపల్లి, పలుగుల తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.వంతెనపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* బీ ఆలర్ట్ ..
ప్రాజెక్ట్‌ల్లో నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాల్లో సంచరించవద్దని, నీటిలోకి దిగొద్దని సాగునీటి శాఖ అధికారులు హెచ్చరించారు.అదే విదంగా వర్షాకాలంలో విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని,చిన్న నిర్లక్ష్యం… పెద్ద ప్రమాదానికి దారీతీస్తుందని విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరిగా అందరూ పాటించాలని ములుగు సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.బిక్షపతి పేర్కొన్నారు.
వర్షాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు . విద్యుత్ మన జీవితానికి వెలుగు నిచ్చే అమూల్యమైన శక్తి అయినప్పటికీ, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
———————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
