S. Srinivas IPS, Instagram Minor Girls Rescue
* ఇన్స్టాగ్రామ్ ప్రభావంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికలు
* ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆధారంగా రైల్లోనే గుర్తించిన పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సోషల్ మీడియా ప్రభావం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో చూపించే ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ప్రభావంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికలను హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైల్వే పోలీసులు, టెక్నికల్ సర్వైలెన్స్ సహకారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.
* పోలీసుల వివరాల ప్రకారం..
జూలై 24న ముగ్గురు బాలికలు తల్లిదండ్రులు చిన్నచిన్న విషయాలపై మందలించడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం కాటేదాన్ నుంచి ఆటోలో బుద్వేల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఢిల్లీకి వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కారు.
మరుసటి రోజు (జూలై 25) ఉదయం ఒక బాలిక తల్లి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. రాజేంద్రనగర్ డీసీపీ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలికల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. బాలికల్లో ఒకరు రహస్యంగా మొబైల్ ఫోన్ తీసుకెళ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఆ అకౌంట్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను సాంకేతికంగా ట్రేస్ చేయడంతో వారు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నట్లు నిర్ధారించారు.
టెక్నికల్ విశ్లేషణ ద్వారా బాలికలు ప్రయాణిస్తున్న కోచ్, సీట్ల వివరాలను కూడా గుర్తించిన పోలీసులు.. మధ్యప్రదేశ్‌లోని బీనా రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసుల సహాయంతో రైలును తనిఖీ చేసి ముగ్గురు బాలికలను క్షేమంగా గుర్తించారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు, కౌన్సెలింగ్ పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీసులు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. పిల్లలతో ఎప్పటికప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని సూచించారు. అలాగే పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని గమనిస్తూ, సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన పెద్దలను సంప్రదించేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
