ఆకేరు న్యూస్, డెస్క్ : మూడో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. యువతతో పాటు వృద్ధులు కూడా భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. ప్రధానంగా మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సమీపంలో ఎస్ ఈసీ కార్యాలయం నుంచి సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల పరిశీలకులను ఓటింగ్ సరళిని రాణి కుముదిని అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఓటింగ్ తక్కువ శాతం నమోదు అవుతుండడంపై అధికారులతో మాట్లాడారు.
ఇదీ లెక్క..
తుది దశ ఎన్నికల పోలింగ్లో మొత్తం 53,06,395 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు, ఇందులో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది స్త్రీలు, 140 మంది ఇతరులు ఉన్నారు. వీరి కోసం 36,452 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 43,856 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. మూడో దశలో 182 మండలాల్లోని మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా.. ఏకగ్రీవాలు, నామినేషన్లు దాఖలు కానివి, కోర్టు స్టేల తర్వాత మిగిలిన 3,752 సర్పంచి పదవులకు 12,652 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 4,502 మంది రిటర్నింగ్ అధికారులు, 77,618 మంది పోలింగ్ సిబ్బంది, మరియు 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నారు. తుది దశ కావడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. మూడో విడతలో 2 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.
ఘర్షణ
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. తమకే ఓట్లు వేయాలని పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు పరస్పరం ఆరోపించుకున్నారు. వాగ్వాదాలు ఘర్షణకు దారి తీశాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా పోలీసులు భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళిని పటిష్ఠంగా అమలు చేస్తూ, పోలీసులు 36,165 మందిని బైండోవర్ చేయడంతో పాటు, ఇప్పటివరకు మొత్తం రూ. 2.09 కోట్ల నగదు, రూ. 3.81 కోట్ల మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన మత్తుపదార్థాలతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
………………………………………….
