*రోజురోజుకూ పెరుగుతున్న నమక్కల్ హనుమంతుడు..
ఆకేరు న్యూస్, డెస్క్:మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కానీ తమిళనాడులోని నమక్కల్ (Namakkal) లో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం వెనుక ఉన్న రహస్యం మాత్రం శాస్త్రవేత్తలకు సైతం సవాలు విసురుతోంది. ఇక్కడి స్వామి వారి విగ్రహం రోజురోజుకూ పెరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. నమక్కల్ కొండ దిగువన సుమారు 1500 ఏళ్ల క్రితం వెలసిన ఈ ఆలయంలో హనుమంతుడు ఏకశిలా విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. దాదాపు 18 నుండి 20 అడుగుల ఎత్తు ఉండే ఈ భారీ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామి వారికి పైన గోపురం కానీ, కప్పు కానీ ఉండదు. కేవలం ఆకాశమే పైకప్పుగా బహిరంగంగానే కొలువై ఉంటారు.
గోపురం నిర్మించకపోవడానికి కారణం ఏంటి?
ఇక్కడి విగ్రహం నిరంతరం పెరుగుతూ ఉండటం వల్లే పైకప్పు నిర్మించడం సాధ్యం కాదని స్థానికులు చెబుతుంటారు. గతంలో పలుమార్లు గోపురం నిర్మించాలని ప్రయత్నించినప్పటికీ, ఏదో ఒక ఆటంకం ఎదురై పనులు ఆగిపోయేవట. అందుకే స్వామి వారు ఎంత ఎత్తు పెరిగినా ఇబ్బంది లేకుండా, ప్రకృతి ఒడిలోనే ఉండాలని అలాగే వదిలేశారు.ఈ ఆలయంలో హనుమంతుడు నడుముకు కత్తితో, చేతులు జోడించి వినమ్రంగా నిలబడి ఉంటారు. దీనికి ఒక పురాణ గాథ ఉంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహ స్వామి ఈ ప్రాంతంలో శాంతించారని, ఆ సమయంలో ఆయనను దర్శించుకోవడానికి ఆంజనేయుడు ఇక్కడికి వచ్చాడని భక్తుల విశ్వాసం. అందుకే స్వామి వారికి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వైపు చూస్తున్నట్టుగా ఈ విగ్రహం ఉంటుంది.ఇక్కడ ప్రార్థిస్తే మనసులోని అలజడులు తొలగి ప్రశాంతత లభిస్తుందని భక్తులు నమ్ముతారు.శని ప్రభావంతో బాధపడేవారు ఇక్కడి స్వామిని దర్శిస్తే ఉపశమనం కలుగుతుందని ప్రతీతి.చెడు అలవాట్లు, భయం వంటి సమస్యలతో బాధపడేవారు ఇక్కడ హనుమంతుడిని వేడుకుంటే ఆపదలు తొలగిపోతాయని నమ్ముతారు.ఆలయ సమీపంలోనే 16వ శతాబ్దానికి చెందిన నామగిరి కోట ఉంది. కొండపై ఉండే ఈ కోట, అక్కడి ఎనిమిది కోనేర్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
______________________________________________________
