*తొర్రూరులో హైటెన్షన్…
*మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ ఉత్కంఠ… 144 సెక్షన్ అమలు!
ఆకేరు న్యూస్, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పట్టణంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళనల మధ్య పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజకీయ సమీకరణలు వేగంగా మారుతుండటంతో తొర్రూరు పట్టణం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా పట్టణంలోని వ్యాపార దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన వీధులన్నీ నిర్మానుషంగా మారాయి. స్థానిక ప్రజలు బయటకు రావడానికి జంకుతుండటంతో కర్ఫ్యూను తలపించే వాతావరణం కనిపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మున్సిపల్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. గ్రూపులుగా చేరడం, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధం విధించారు. సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయం వైపు వచ్చే దారులన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
