* శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి
ఆకేరు న్యూస్, పాలకుర్తి : విజయం వరించిన వేళ.. దైవ దర్శనంతో తమ కృతజ్ఞతను చాటుకున్నారు పాలకుర్తి ప్రజాప్రతినిధులు. ఇటీవల జరిగిన తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లతో కలిసి పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి వారిని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల నమ్మకం, దైవ దీవెనల వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. గెలుపు అనేది అహకారాన్ని కాకుండా, బాధ్యతను పెంచిందని అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నూతన కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యమైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు రాజకీయ సందడితో మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
