* పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయాలి
.* కిట్స్ వరంగల్‌లో గిరిజన విద్యార్థులకు ‘ఆవిష్కరణల’ బాట…
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ కిట్స్ (KITSW) ఇంజనీరింగ్ కళాశాల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. వరంగల్ జిల్లా కొత్తవాడలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన సుమారు 80 మంది విద్యార్థినులు ప్రత్యేక మార్గదర్శకత్వ సెషన్ ద్వారా ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం పుస్తక జ్ఞానం సరిపోదని, STEM (Science, Technology, Engineering, and Mathematics) రంగాల్లో పట్టు సాధించాలన్నారు. వినూత్న ఆలోచనా దృక్పథాన్ని (Innovative Mindset) అలవరుచుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించడానికి కిట్స్ వరంగల్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డిజైన్ ఛాలెంజెస్ & హ్యాకథాన్ల క్లిష్టమైన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను వెతకడం. సొంతంగా వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేయడం. మార్కెట్ అవసరాలను గుర్తించడం. ఆలోచనలను పెట్టుబడిదారులకు లేదా నిపుణులకు వివరించే నైపుణ్యం పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
* తాజా మార్పులను అందిపుచ్చుకోవాలి.
, సాంకేతిక రంగంలో వస్తున్న తాజా మార్పులను అందిపుచ్చుకోవాలని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీకాంత్ పబ్బా సూచించారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (వ్యవస్థాపకత) వైపు విద్యార్థులు అడుగులు వేయడానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలను ఆయన వివరించారు. C-I²RE అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ కె. రాజనరేందర్ రెడ్డి ఈ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, గ్రామీణ మరియు గిరిజన ప్రాంత విద్యార్థులకు ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మరియు ఐడియా కనెక్టింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించినట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్‌కు చెందిన వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు మరియు SAiL ప్రతినిధులు పాల్గొన్నారు. కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & పిఆర్ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి సమన్వయకర్తగా వ్యవహరించారు. సుమారు 180 మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు గిరిజన కళాశాల విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. గిరిజన విద్యార్థులకు సాంకేతికతపై ఉన్న ఆసక్తిని చూస్తుంటే, సరైన మార్గదర్శకత్వం లభిస్తే వారు అద్భుతమైన ఆవిష్కర్తలుగా ఎదుగుతారని ఈ సెషన్ నిరూపించింది. భవిష్యత్తులో మరిన్ని విద్యా సంస్థలతో కలిసి ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని కిట్స్ యాజమాన్యం ప్రకటించింది.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
