* పనులు ప్రారంభమై మూడు నెలలు
* నడవ వీలు లేకుండా మారిన తాటికొండ కంకర రోడ్డు
* అవస్థలు పడుతున్న వాహనదారులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ-మల్లన్న గండి రోడ్డు విస్తరణ పనులు గత మూడు నెలలుగా సాగుతున్నాయి. పాత రోడ్డును తొలగించి (డబ్ల్యూ ఎంఎం) వెట్ మిక్స్ మెకడం పోస్తున్నారు. డబ్ల్యూ ఎంఎం పోసి వాటర్ క్యూరింగ్, రోలింగ్ చేయాల్సి ఉండగా క్యూరింగ్, రోలింగ్ క్రమంగా చేయించకపోవడంతో తాటికొండ క్రాస్ రోడ్ నుండి మల్లన్న గండి వరకు సుమారు 17 కిలోమీటర్ల రోడ్డు కంకర తేలి నడవ వీలు లేకుండా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
* 15 కోట్లు మంజూరు..
హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారిని ఆనుకుని తాటికొండ క్రాస్ రోడ్డు నుండి కొత్తపల్లి, తాటికొండ, జిట్టగూడెం గ్రామాల మీదుగా మల్లన్న గండి వరకు దాదాపు 17 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు 15 కోట్లు మంజూరు చేస్తూ అక్టోబర్ 11, 2024న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* మూడు నెలలుగా సాగుతున్న పనులు
గత మూడు నెలలుగా రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పాత కల్వర్టులను తొలగించి కొత్త కల్వర్టుల నిర్మాణం, పాత బిటి రోడ్డు ను తొలగించి కొత్త బీటీ వేసేందుకు డబ్ల్యూ ఎంఎం పోస్తున్నారు. కొత్తపల్లి, తాటికొండ గ్రామంలో మినహా ఈ రెండు గ్రామాలకు ఇరువైపున డబ్ల్యూ ఎంఎం పోశారు.

* క్యూరింగ్, రోలింగ్ మరిచారు
దాదాపు 17 కిలోమీటర్ల నిడివితో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో డబ్ల్యూ ఎంఎం పోసిన తర్వాత ప్రతిరోజు క్యూరింగ్ తర్వాత రోలింగ్ చేయాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్ రెండింటిని విస్మరించారు. కొత్తగా నిర్మించిన కల్వర్టుల వద్ద, మూల మలుపుల వద్ద కంకర తేలి నడవ వీలు లేకుండా మారింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఈ మార్గంలో వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కొత్తపల్లి నుండి స్టేషన్ ఘన్ పూర్ కి ఆటో చార్జీలు 20 రూపాయలకు బదులు 30 రూపాయలు, తాటికొండ నుండి 30 రూపాయలకు బదులు 40 రూపాయలు వసూలు చేస్తుండడంతో అనునిత్యం మండల కేంద్రానికి వచ్చి వెళ్లే గ్రామాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

* వాహనాలు దెబ్బతింటున్నాయి
కంకర తేలిన రోడ్డుపై ఆటోలు నడపడం మాకు సవాల్ గా మారిందని ఆటో డ్రైవర్ మారపాక శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. టైర్ పంచర్లు కావడం ఏడుగురు ప్రయాణికులతో తీసుకువెళ్లాల్సిన ఆటోను కేవలం నలుగురు ఐదుగురితో వెళ్తున్నామని దీంతో సరిపడా ఆదాయం రాక ఆటోలు దెబ్బ తింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
* త్వరగా బీటీ వేయాలి
మూడు నెలల క్రిందట చేపట్టిన తాటికొండ మల్లన్న గండి రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డబ్ల్యూ ఎం ఎం పై క్యూరింగ్, రోలింగ్ చేయించి త్వరితగతిన బీటీ రోడ్డు వేయించాలని కొత్తపల్లి, తాటికొండ జిట్టగూడెం గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
