అలిపిరి గేట్ వద్ద రూ. 65 లక్షల నగదు పట్టివేత…
తిరుమల కొండపైకి తరలిస్తుండగా టీటీడీ విజిలెన్స్ నిఘా…
ఆకేరు న్యూస్, తిరుపతి:
తిరుమల శ్రీవారి చెంతకు అక్రమంగా నగదు తరలించే ప్రయత్నం ఒకటి వెలుగులోకి వచ్చింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. ఒక వ్యక్తి కారులో సుమారు రూ. 65 లక్షల నగదును తరలిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
మంగళవారం మధ్యాహ్నం అలిపిరి భద్రతా తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో ఒక ప్రైవేట్ కారుపై అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ కారును పక్కకు ఆపి తనిఖీ చేయగా, లోపల ఒక బ్యాగులో కట్టల కొద్దీ నగదు కనిపించింది. లెక్కించగా అది రూ. 65 లక్షలుగా తేలింది. ఇంత భారీ మొత్తానికి సంబంధించి సదరు వ్యక్తి వద్ద ఎలాంటి సరైన పత్రాలు గానీ, అనుమతులు గానీ లేకపోవడంతో విజిలెన్స్ సిబ్బంది వెంటనే అతడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
చిల్లర వ్యాపారం కోసమంటూ పొంతన లేని సమాధానాలు:
ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి చెప్పిన విషయాలు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. తిరుమలలో భక్తుల ద్వారా హుండీలో లభ్యమయ్యే చిల్లర నాణేలు (కాయిన్స్) తీసుకోవడానికి తాను ఈ నగదును తీసుకువెళ్తున్నట్లు అతను పేర్కొన్నాడు. తాను వ్యాపారం చేస్తున్నానని, నోట్లను ఇచ్చి చిల్లర తీసుకునేందుకే కొండపైకి వెళ్తున్నానని సమాధానమిచ్చాడు. అయితే, అంత పెద్ద మొత్తంలో నగదును ఎక్కడి నుండి సేకరించారు? ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నారు? అనే ప్రశ్నలకు అతను స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయినట్లు సమాచారం.
విచారణ ముమ్మరం.. ఐటీ అధికారులకు సమాచారం!
సాధారణంగా తిరుమలలో టీటీడీ అధికారికంగానే చిల్లర మార్పిడి కేంద్రాలను నిర్వహిస్తుంది. అలాంటప్పుడు వ్యక్తిగత స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో నగదును కొండపైకి తీసుకువెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా? లేదా హవాలా నెట్వర్క్ ఏదైనా పనిచేస్తుందా? అనే కోణంలో విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన నగదును, వ్యక్తిని తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపు పన్ను శాఖ (IT) లేదా స్థానిక పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.
భద్రత కట్టుదిట్టం:
ఈ ఘటన నేపథ్యంలో అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గాల్లో తనిఖీలను టీటీడీ మరింత కట్టుదిట్టం చేసింది. శ్రీవారి సన్నిధిలో అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా నిరంతరం నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
