సొంత చెల్లిపై కన్నేసిన అన్న…
పల్నాడు జిల్లాలో కలకలం రేపుతున్న వైనం
ఆకేరు న్యూస్, పల్నాడు: సమాజంలో మారుతున్న విలువలు, విచ్చలవిడితనం చివరకు రక్త సంబంధాల మధ్య ఉండాల్సిన పవిత్రతను కూడా మంటగలుపుతున్నాయి. వరుసకు చెల్లెలు అయ్యే యువతిని ప్రేమ పేరుతో వేధించిన ఒక ఉన్మాది ఉదంతం పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఘటన వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా కాకుమాను మండలం, భల్లుఖనూడి పాలెం గ్రామానికి చెందిన ఒక యువతి నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. కాగా, ఆమెకు సొంత పెద్దమ్మ కుమారుడైన రత్నరాజ్ అనే యువకుడు వరుసకు అన్న అవుతాడు. అయితే, చెల్లిగా భావించి రక్షణగా ఉండాల్సిన రత్నరాజ్, గత కొంతకాలంగా సదరు యువతిని ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
కుటుంబ బంధుత్వాన్ని గుర్తు చేస్తూ, ఇది ఎంతమాత్రం సరికాదని ఆ యువతి పలుమార్లు అతడిని హెచ్చరించింది. అయినప్పటికీ నిందితుడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, “ఈ రోజుల్లో వావి వరుసలు ఎక్కడున్నాయి?” అంటూ బరితెగించి మాట్లాడటమే కాకుండా, ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తూ మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు.
బస్టాండ్లో బరితెగింపు..
ఈ క్రమంలో నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ఊరికి వెళ్లేందుకు బస్సు ఎక్కడానికి వచ్చిన యువతిని రత్నరాజ్ అడ్డుకున్నాడు. అందరూ చూస్తుండగానే ఆమె చేయి పట్టుకుని లాగుతూ, తనతో రావాలని బలవంతం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు వివరించగా, వారు తక్షణమే నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల రంగప్రవేశం:
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రత్నరాజ్ను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్థానిక మహిళా సంఘాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రక్త సంబంధాలను కూడా గౌరవించకుండా ప్రవర్తించిన నిందితుడిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
కుటుంబ విలువల పట్ల అవగాహన లోపించడం, చెడు వ్యసనాలకు బానిసలవుతున్న యువత పెడదోవ పడుతుండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
