* ఈనెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు..
* విద్యార్థులకు రూట్ మ్యాప్ సౌకర్యం!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మార్చి 14వ తేదీన ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, అందులో 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటికే ముమ్మరంగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు.
హాల్‌టికెట్ల డౌన్లోడ్ ఇలా..
పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను పాఠశాలలతో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాంకేతికతను జోడిస్తూ ఈసారి 8096958096 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా హాల్‌టికెట్లు పొందే వెసులుబాటు కల్పించారు. విశేషమేమిటంటే, పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీనిని మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి వెళ్లే రూట్ మ్యాప్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
పరీక్షల నిర్వహణ వివరాలు:
సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.
ప్రభుత్వ పాఠశాలలు: 5,329 పాఠశాలల నుంచి 2,07,573 మంది.
గురుకులాలు: 1,057 పాఠశాలల నుంచి 60,139 మంది.
ప్రైవేట్ & ఎయిడెడ్: 5,288 పాఠశాలల నుంచి 2,50,015 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
అధికారుల సూచనలు:
పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం సీసీ కెమెరాల నిఘాలో పశ్నపత్రాలను ఓపెన్ చేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాలను చదివి, ప్రాక్టీస్ చేయడం ద్వారా సమాధానాలను చక్కగా గుర్తుంచుకోవచ్చని ఆయన సూచించారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆకాంక్షించారు.
