* ఫ్యూచర్ సిటీలో స్థలం కేటాయిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్ సంస్థ విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయం కూడా ఈ మహానగరం నుంచి కొనసాగాలని ఆయన అభిలషించారు.
దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఐలైన్ స్టూడియో ప్రారంభంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో హైదరాబాద్ విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కానుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసిందని, నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్‌ఫ్లిక్స్ విస్తరణ కోసం తగినంత స్థలం కేటాయిస్తామని, అవసరమైతే నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించాలని కోరారు.
ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి టెక్నోకలర్, అక్కడి నుంచి ఈస్ట్‌మన్ కలర్, తర్వాత 70 ఎంఎం, డాల్బీ వరకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాంతం టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ స్థాయికి ఎదగాలని తాము కాంక్షిస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, పెట్టుబడులకు అన్ని విధాలుగా రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు.
నెట్‌ఫ్లిక్స్ ప్రపంచానికి వినోదాన్ని అందిస్తుంటే, తాము ప్రపంచాన్ని సుసంపన్నం చేయాలని చూస్తున్నామని, ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ మధ్య సారూప్యత ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. డీవీడీల స్థాయి నుంచి ఓటీటీ లీడర్‌గా ఎదిగిన నెట్‌ఫ్లిక్స్, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇటీవల స్పోర్ట్స్‌పై కూడా దృష్టి సారించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడాభివృద్ధికి కలిసి పనిచేసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐలైన్ స్టూడియో సీఈఓ జెఫ్ షపిరో, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, సినీ నటుడు, నిర్మాత రాణా దగ్గుబాటి, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మరియు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
