* ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి: నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వ్యక్తిగత సహాయకుడు (PA) శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి మోసం చేయడమే కాకుండా, కులం పేరుతో దూషించిన ఆరోపణలపై చిట్యాల పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
బాధితురాలి కుటుంబ సభ్యులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండలో నివాసం ఉంటున్న శ్రీనివాస్, చిట్యాల మండలానికి చెందిన ఓ దళిత యువతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, ఇటీవల మరో పోలీస్ కుటుంబానికి చెందిన యువతితో పెళ్లి సంబంధం నిశ్చయం చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది.
కులం పేరుతో దూషణలు, బెదిరింపులు.
శ్రీనివాస్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న బాధితురాలు (జ్యోతి), అతడిని నిలదీసింది. ఈ క్రమంలో శ్రీనివాస్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమే కాకుండా, కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ వివాదంపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినప్పటికీ, శ్రీనివాస్ తన మొండి వైఖరిని వీడలేదు.
పోలీసుల చర్యలు…
న్యాయం కోసం బాధితురాలు చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేశారు.. ఎస్సీ, ఎస్టీ (SC/ST) అట్రాసిటీ చట్టం, నమ్మించి మోసం చేయడం (Cheating), నేరపూరిత బెదిరింపులు. కేసు నమోదు చేసిన వెంటనే నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ ధ్రువీకరించారు.

రాజకీయ ప్రకంపనలు…
అధికార పార్టీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన పీఏ ఇలాంటి ఆరోపణలతో అరెస్ట్ కావడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
