* యూరియా యాప్ పేరుతో రైతులపై వేధింపులు…
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ముఖ్యంగా యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారానే యూరియా పొందాలనే నిబంధన క్షేత్రస్థాయిలో విఫలమైందని, ఇది పరోక్షంగా రైతులను వేధించడమేనని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలోని రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి సాంకేతిక నిబంధనలు రుద్దడం సమంజసం కాదని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం సుమారు 50 శాతం మంది రైతుల వద్ద కనీసం స్మార్ట్ఫోన్లు కూడా లేవని, ఫోన్లు ఉన్న మరో 50 శాతం మందిలో సగం మందికి ఆ యాప్ను ఎలా ఉపయోగించాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. వెరసి దాదాపు 75 శాతం మంది రైతులకు ఈ యాప్ విధానం ఒక గుదిబండగా మారిందని ఆయన అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు.
యూరియా కొనుగోలు ప్రక్రియలో ఉన్న అస్తవ్యస్త విధానాలను వివరిస్తూ.. ప్రస్తుతం రైతులు ఒక బస్తా యూరియా కోసం రెండు సార్లు మీ-సేవ కేంద్రాలకు లేదా డీలర్ల వద్దకు తిరగాల్సి వస్తోందని ఆయన తెలిపారు. మొదటి రోజు బుకింగ్ కోసం, రెండో రోజు స్టాక్ సేకరణ కోసం రైతులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని విమర్శించారు. ఒక దఫాలో కేవలం 5 బస్తాలకు మించి ఇవ్వకపోవడం వల్ల, ఎక్కువ సాగు భూమి ఉన్న రైతులు పదేపదే కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మండలానికి కేవలం ఒకే ఒక పంపిణీ కేంద్రాన్ని కేటాయించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు రవాణా ఖర్చులు భారం కావడమే కాకుండా, సమయం కూడా వృధా అవుతోందని వేముల ప్రశాంత్ రెడ్డి ఎత్తిచూపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మండల వ్యాప్తంగా మరిన్ని యూరియా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు సాగు చేసిన పంట విస్తీర్ణానికి అనుగుణంగా, అవసరమైన యూరియాను కోటాతో సంబంధం లేకుండా ఒకేసారి పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
