‘తెలంగాణ పేరెంట్ కేర్ బిల్ – 2026’
అసెంబ్లీ ఆమోదానికి రానున్న బిల్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వృద్ధాప్యంలో కన్నతల్లిదండ్రులను అనాథలుగా వదిలేసే పిల్లలకు బుద్ధి చెప్పేలా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ (Parents Support Bill) ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. తల్లిదండ్రుల పోషణను విస్మరించే ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా కోత విధించి, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
*బిల్లులోని ముఖ్యాంశాలు..
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగి జీతం నుండి 15 శాతం లేదా రూ. 10,000 (ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది) ప్రతి నెలా కట్ చేస్తారు.
ఎవరికి వర్తిస్తుంది? : ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్, మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఆధారం లేని తల్లిదండ్రులు జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారికి (జిల్లా కలెక్టర్) దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పరిశీలించిన అధికారులు 60 రోజుల్లోగా సమస్యను పరిష్కరించి, జీతం కోతకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తారు.
*అప్పీలు చేసుకునే అవకాశం ..
ఒకవేళ జిల్లా స్థాయి అధికారుల వద్ద సమస్య పరిష్కారం కాకపోతే, రాష్ట్ర స్థాయిలోని రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిషన్కు అప్పీలు చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
*ప్రభుత్వ లక్ష్యం..
సమాజంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వారు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా, ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అస్సాం రాష్ట్రంలోని ‘ప్రణామం’ (PRANAM) చట్టం తరహాలోనే తెలంగాణలో కూడా ఈ విప్లవాత్మక మార్పును రేవంత్ ప్రభుత్వం తీసుకువస్తోంది.
