*రెండు పార్టీల నాయకుల ఘర్షణ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రాములోరి ఊరేగింపులో రెండు (కాంగ్రెస్, టిఆర్ఎస్) పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగి పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన సంఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇరువర్గాల కథనం ప్రకారం… శుక్రవారం స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అదే రోజు రాత్రి సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ క్రమంలో కళ్యాణ మహోత్సవం జరిగిన తీరును ఒక వర్గం నాయకులు మరో వర్గం నాయకులతో చర్చిస్తున్న క్రమంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదంతో మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ విషయమే టిఆర్ఎస్ నాయకులు మొదట మాపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతుండగా ఊరేగింపులో వెళుతున్న తనను పిలిచి దాడి చేశారని టిఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. రెండు వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడిని తేల్చుకునేందుకు శనివారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఇరువర్గాలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.
