* వార్షిక గడువు ముగింపు: వరంగల్ మున్సిపల్ ఆఫీసుల వద్ద పన్ను చెల్లింపుదారుల క్యూ!
* GWMC పరిధిలో పన్నుల హడావిడి: మార్చి 31 ఆఖరు తేదీ కావడంతో క్యూ కట్టిన నగర ప్రజలు.
* నక్కలగుట్ట మున్సిపల్ కార్యాలయంలో రద్దీ!
ఆకేరు న్యూస్,హనుమకొండ/వరంగల్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగుస్తున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో పన్నుల వసూళ్లు వేగం పుంజుకున్నాయి. ఆస్తి పన్ను, నల్లా పన్ను చెల్లింపులకు మార్చి 31 ఆఖరి తేదీ కావడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో మున్సిపల్ కార్యాలయాలకు తరలివస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే నక్కలగుట్టలోని ప్రధాన మున్సిపల్ కార్యాలయంలోని పన్ను చెల్లింపు కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.
గడువు ముగియడానికి ఒక్క రోజే సమయం ఉండటంతో, అదనపు అపరాధ రుసుము (Fine) పడకుండా ఉండేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు పన్ను చెల్లింపు కేంద్రాలను ఉదయం నుంచే అందుబాటులోకి తెచ్చారు. ప్రజల సౌకర్యార్థం ఆన్లైన్ చెల్లింపులతో పాటు, కార్యాలయాల్లో కూడా కౌంటర్ల సంఖ్యను పెంచాలని స్థానికులు కోరుతున్నారు. గడువు ముగిసిన తర్వాత పన్ను చెల్లిస్తే వడ్డీ భారం పడే అవకాశం ఉండటంతో, వెంటనే తమ పన్ను బకాయిలను చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.
