* వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరే
ఆకేరు న్యూస్, హన్మకొండ: అణచివేతపై గళమెత్తి, శ్రామిక వర్గాల పక్షాన నిలిచే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సోమవారం హన్మకొండలోని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో అరుణోదయ ఉమ్మడి జిల్లా 7వ మహాసభలను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడిగా ఇట్టబోయిన రవి, ప్రధాన కార్యదర్శిగా గుర్రం అజయ్ ఎన్నికయ్యారు.
ఘనంగా జెండా ఆవిష్కరణ.. స్ఫూర్తిదాయక ప్రసంగాలు:
కార్యక్రమం ప్రారంభంలో ఇట్టబోయిన రవి అరుణోదయ జెండాను ఆవిష్కరించారు. సభకు ముఖ్య వక్తలుగా విచ్చేసిన ప్రజా కవి, వాగ్గేయకారుడు మరియు అరుణోదయ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిరంజీవి, ఇడంపాక శ్రీశైలం ప్రసంగిస్తూ.. సామాజిక మార్పులో కళల పాత్రను కొనియాడారు. ఏప్రిల్ 10, 11 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
చైతన్యానికి మారుపేరు అరుణోదయ: గుర్రం అజయ్
నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం అజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండి యాదగిరి వారసత్వాన్ని, పాణిగ్రాహి పాటల స్ఫూర్తిని అరుణోదయ పుణికిపుచ్చుకుందని గుర్తుచేశారు. 1974లో ఆవిర్భవించిన ఈ సంస్థ 52 ఏళ్లుగా దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా డప్పుల దరువుతో జైత్రయాత్ర సాగిస్తోందన్నారు. ఒగ్గు కథలు, బుర్ర కథలు, హరికథల వంటి జానపద కళారూపాల ద్వారా సారా వ్యతిరేక ఉద్యమం, మూఢ నమ్మకాలు, వరకట్న వేధింపులపై ప్రజలను చైతన్యపరిచిన ఘనత అరుణోదయదేనని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ‘ధూం ధాం’ వేదికల ద్వారా ఆంధ్ర పాలకుల మోసాలను తూటాల్లాంటి పాటలతో ఎండగట్టామని ఆయన గుర్తుచేశారు. ఈ పోరాట క్రమంలో కనూరి వెంకటేశ్వర్లు, పల్స భిక్షం వంటి ఎందరో అమర కళాకారులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, భవిష్యత్ కర్తవ్యాల రూపకల్పన కోసమే హైదరాబాద్ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
