* ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలవైపు నిలుస్తాను
* అవి వ్యక్తిగత హత్యలు కావు .. అయినా పొరపాటే
– మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ
ఆకేరు న్యూస్, అమరావతి : సీపీఐ మావోయిస్ట్ పార్టీ మారిన పరిస్థితులక అనుగుణంగా మారలేదు. అందుకే పోలీసుల ముందు లొంగిపోతున్నాను.. పార్టీ సంస్థా గత నిర్ణయంలో భాగంగానే అప్పట్లో హత్యలు జరిగాయి. నాకెవరి మీద వ్యక్తిగత కక్ష లేదు. అయినా అది పొరపాటు చర్యగానే భావిస్తున్నానని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆంధ్రా -ఒరిస్సా బోర్డర్ కార్యదర్శి చెల్లూరి నారాయణ రావు అలియాస్ సోమన్న అన్నారు. ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ గుప్తా లొంగిపోయారు. ఆయనతో పాటు 9 మంది స్పెషల్ జోనల్ కమిటీ , డివిజనల్ కమిటీ స్థాయి మావోయిస్టులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. హిడ్మా ఎన్ కౌంటర్ వల్లనో ఇతర సమస్యల వల్లనో నేను భయపడి భయపడి రాలేదు. పార్టీ నిర్మాణ , రాజకీయ , సైద్ధాంతిక పరమైన సమస్యలతో పాటు వ్యూహాత్మకమైన ఎత్తుగడల విషయంలోనే పొరపాటు ఉందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు అండగా ఉంటానన్నారు.
35 ఏళ్లుగా అజ్ఞాతంలో ..
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురి గ్రామానికి చెందిన చెల్లూరి నారాయణ రావు 35 ఏళ్ళ క్రితం మావోయిస్ట్ ఉద్యమంలో చేరారు. ఏవోబీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ బలపడడంలో నారయణరావు పాత్ర క్రియాశీలకమైనది.
