* పోలీసులకే షాక్ ఇచ్చిన గ్రామస్తులు..
* హెల్మెట్ ఉంటేనే గ్రామంలోకి అనుమతి!
* మహబూబాబాద్ లో ప్రాణ రక్షణే ధ్యేయంగా అడుగులు
ఆకేరు న్యూస్, డెస్క్: నేటి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎవరి రూపంలో ముంచుకొస్తాయో తెలియడం లేదు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల చిన్న చిన్న ప్రమాదాల్లో కూడా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితిని మార్చాలని, గ్రామస్థుల ప్రాణాలను కాపాడాలని మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.
* గ్రామ పొలిమేరల్లోనే హెచ్చరికలు:
సాధారణంగా హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసులు జరిమానా విధిస్తారు. కానీ, వెంకటాపురం గ్రామస్తులు అంతకంటే ముందుగానే ఒక అడుగు ముందుకు వేశారు. గ్రామంలోకి వచ్చే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధన విధించారు. ఇందుకోసం గ్రామ శివార్లలోనే “NO HELMET – NO ENTRY” (హెల్మెట్ లేనిదే ప్రవేశం లేదు) అనే ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.
* అందరి ప్రశంసలు:
ఈ నిర్ణయం వెనుక గ్రామ పాలకవర్గం మరియు గ్రామ పెద్దల కృషి ఎంతో ఉంది. గ్రామస్థుల రక్షణే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో మరియు స్థానికంగా సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. “చట్టం కన్నా ప్రాణం ముఖ్యం” అనే సందేశాన్ని ఈ గ్రామం చాటి చెబుతోంది. పోలీసు అధికారులు సైతం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఇతర గ్రామాలకు సూచిస్తున్నారు.
