* గ్రామ సభల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించిన జిల్లా కలెక్టర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల నిర్వహణ కోసం ప్రామాణిక నిర్వహణ విధానాలు, షెడ్యూల్ ను తెలంగాణ ప్రణాళిక శాఖ విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో గ్రామ సభ యొక్క లక్ష్యాలు, పాల్గొనాల్సినవారు , గ్రామ సభక కావలసిన సన్నాహకాలు, పత్రాల తయారీ, అమలులో ఉన్న ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, కొత్త పథకాల గూర్చి చర్చ తదితర అంశాలున్నాయి . ఇప్పటికే గ్రామ సభల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ నియమించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సభలను ఉదయం 8 గంటలకే ప్రారంభం కానుంది. గ్రామ సభల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించడం, ఆపై ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించడం ఈ సభల్లోని ప్రధానాంశం.గ్రామ సభల నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ప్రభుత్వం గత కొద్ది రోజులుగా చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ శాఖల ద్వారా సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచనున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించడం ద్వారా అర్హులకు భరోసా కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి 10 ప్రధాన అంశాలపై ఈ సభలు చర్చించనున్నాయి. గ్రామస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి స్థానికంగానే ప్రణాళికలు రూపొందించడం వీటిపై తీర్మానాలు , కార్యాచరణ ముగింపు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రగతి యాత్రలో రేపటి గ్రామ సభలు అత్యంత కీలకమని, వీటిని విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

