Warangal Hanamkonda merger decision
* 2027 తర్వాతనే జిల్లాల పునుర్విభజన నిర్ణయాలు
* ఆదిలాబాద్‌లో స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్ , వరంగల్ ప్రతినిధి: వరంగల్ – హనుమకొండ జిల్లాలు కలిసి పోతాయని ప్రజలు ఎదురు చూశారు. ఇక ఇప్పట్లో కలిసే అవకాశం లేనేలేదని సీఎం రెవంత్ రెడ్డి ప్రకటనతో తేలి పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాను అప్పటి బీఆర్ ఎస్ పాలకులు అన్యాయంగా ఆరు జిల్లాలుగా విభజించారని కాంగ్రెస్ నాయకులు, మేధావి వర్గం తీవ్రంగా విమర్శించింది. అన్నిటికి మించి హనుమకొండ- వరంగల్ జిల్లాల పేరుతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రేటర్ వరంగల్ నగరాన్ని రెండు గా చీల్చారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు జిల్లాలు కలుస్తాయని ఆశపడ్డారు.ఇందుకోసం ఏకంగా అన్ని రాజకీయ పార్టీలు , మేధావులు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఒక జేఏసీగా ఏర్పడి ఆందోళనలు కూడా చేశారు. కొంత కాలానికి సీఎం రేవంత్ రెడ్డి సైతం రెండు జిల్లాలను కలిపే విషయంలో సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం వరంగల్ – హనుమకొండ జిల్లాలు కలిసి పోతున్నాయనే భావనలోనే ఉన్నారు.
* ఉద్యోగావకాశాల్లో నాన్ లోకల్
హనుమకొండ- వరంగల్ జిల్లాలు వేర్వేరుగా ఉండడం వల్ల అనేక రూపాల్లో నష్టం జరుగుతోందన్న భావన ఉంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో జిల్లాల విభజన కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కాదు.. రాజకీయ నాయకత్వ విభజనలో భాగంగానే ఉమ్మడి వరంగల్‌ను ఆరు ముక్కలు చేశారని ప్రొఫెసర్ వెంకటనారాయణ తీవ్రంగా విమర్శిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ లాంటి పెద్ద జిల్లాలో రాజకీయ నాయకత్వం బలంగా ఉండకూడదన్న భావన కేసీఆర్‌కు ఉండేదని చెబుతుంటారు. అన్నిటికి మించి ఉద్యోగావకాశాల్లో గ్రేటర్ వరంగల్ లోని రెండు తూర్పు- పశ్చిమ ప్రాంతాలు నాన్ లోకల్ గా విభజించబడ్డాయి. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న మెగా కాకతీయ టెక్స్ టైల్ లాంటి పరిశ్రమలు, ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా లాంటి ఇతర పరిశ్రమల్లో ఎంజీఎం ఆసుపత్రి కి ఆవల ఉన్న పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థులు నాన్ లోకల్‌గా పరిగణించబడతారు. అదే విదంగా కాజీపేట లో ఏర్పాటు చేసిన కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు ఎంజీఎం దాటి తూర్పు వైపున ఉన్న అభ్యర్థులంతా నాన్ లోకల్ అభ్యర్థులుగా మారిపోతారు.. ఇతరత్రా అనేక అంశాలు హనుమకొండ- వరంగల్ జిల్లాలు వేర్వేరుగా ఉండడం వల్ల నష్టాలు జరుగుతాయి..
* వరంగల్ జిల్లా కలెక్టరేట్ గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్యాలయం
వరంగల్ – హనుమకొండ జిల్లాలు కలిసిపోయి ఒకే జిల్లా అయినప్పుడు వరంగల్ జిల్లా కోసం నిర్మిస్తున్నజిల్లా కలెక్టరేట్ భవనం ఏం చేస్తారన్న సందేహాలు వ్యక్తం అయినాయి. అయితే ఆ భవనాన్ని గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ కార్యాలయం కోసం కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. దాదాపు నిర్ణయం జరిగింది.. ఇదిగో – అదిగో తొందరలోనే రెండు జిల్లాలు కలిసిపోతాయని పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. రెండు జిల్లాలు కలిసి పోయి ఒకే ఒక్క జిల్లాగా ఏర్పడాలన్న వారి ఆశలను సీఎం రేవంత్ రెడ్డి తుంచేశారు. ఇప్పట్లో సరికొత్త మండలాలు, రెవిన్యూ డివిజన్ కేంద్రాలు కొత్త జిల్లాలు , జిల్లాల పునర్వ వస్థీకరణ లాంటి లేనేలేవని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఈ విషయం స్పష్టం చేశారు. 31 మార్చి 2027 వరకు జిల్లాలకు సంబందించి ఎలాంటి మార్పులు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఆ తర్వాత జుడిషియల్ కమిషన్ వేసి పునర్వ వస్తీకరణ అంశాలు పరిశీలిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జిల్లాల విలీనం లాంటి నిర్ణయాలలు తీసుకునే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..
—————-
