TRS farmers maize protest
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
మార్కెట్ కు తెచ్చిన ప్రతి మక్కజొన్న గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ లో పలు గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. చిల్పూర్ మండలం మల్కాపూర్, శ్రీపతి పల్లి, లింగంపల్లి, కొండాపూర్ రైతులు స్థానిక వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గత పది పదిహేను రోజులుగా మక్కలు మార్కెట్లో పోసి తూకం వేసేందుకు పడిగాపులు కాస్తున్న రైతులతో కలిసి మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫంగస్, కటింగ్ పేరుతో తెచ్చిన మక్కలను కాంట వేయకుండా తిరస్కరిస్తున్న మార్క్‌ఫెడ్ అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ స్వయంగా ఎమ్మెల్యే ప్రారంభించిన మక్కల కొనుగోలు కేంద్రంలో అధికారులు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కటింగ్, ఫంగస్ పేరుతో రైతుకు తెచ్చిన మక్కజొన్నలను మార్క్‌ఫెడ్ అధికారులు రిజెక్ట్ చేస్తే 1800, 1700, 1900 లకు అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అన్నారు. మార్క్‌ఫెడ్ అధికారులు, దళారులు కుమ్మక్కై రైతులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి మార్కెట్ కు తెచ్చిన మక్కజొన్నలు మార్క్ ఫెడ్ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చల్ల లావణ్య, బూర్ల రాజేశ్వర్, జనగామ యాదగిరి, రంగు హరీష్, కొండాపూర్ సర్పంచ్ దేవేందర్, మాజీ సర్పంచ్ రవీందర్, పల్లపు తిరుపతి, బండి బాలరాజు, ప్రవీణ్, రవీందర్, బూర్ల, రాజు తదితరులు పాల్గొన్నారు.
