MLA KADIYAM SRIHARI STATION GHANPUR
*అందినకాడికి దోచుకొని రాష్ట్రాన్ని దివాళా తీయించారు
అకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
గత పాలకులు పదేళ్లలో అందిన కాడికి దోచుకుని రాష్ట్రాన్ని దివాలా తీయించారని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ద్వజమెత్తారు. జనగామ జిల్లా జఫర్గడ్, స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రాలలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మంగళవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అమలయ్యే ఏ పథకం అయిన అర్హులైన నిరుపేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేరుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకొని మే 31లోపు మొదటి విడత ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన గ్రామాలకే రెండో విడతలో ఇండ్లు కేటాయిస్తానని స్పష్టం చేశారు. వరి కోతలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐకేపి కొనుగోలు కేంద్రాలకు స్థానిక సర్పంచులు సహకారం అందించాలని సూచించారు. వ్యవసాయ శాఖ వారు వ్యవసాయ యాంత్రికరణకు 50 శాతం సబ్సిడీతో రూటవేటర్లు, బేయిలర్స్, డ్రోన్లు, బ్యాటరీ స్ప్రేయర్స్ వంటి పనిముట్లు అందిస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ యాంత్రికరణ దిశగా రైతులను ప్రోత్సాహించాలని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని గత పాలకులు స్వార్థ ప్రయోజనాలకు ఉపయోంచుకున్నారని, వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు కూడబెట్టుకున్నారే తప్ప ప్రజలకు ఒరేగబెట్టింది ఏమి లేదని విమర్శించారు. తెలంగాణ వనరులను అడ్డగోలుగా అందినకాడికి దోచుకొని 8 లక్షల కోట్లు అప్పు చేసి దివాళా తీయించారాని ఆరోపించారు. ఇప్పుడు వాళ్లే ఏమి తెలియని సుద్దపూసల లెక్క నీతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పదవులు, పథకాలు, పనులు అమ్ముకోవడమే కాకుండా చిల్లర పనులు, చిలిపి చేష్టలతో నియోజకవర్గ పరువు తీసాడని అలాంటి వారి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందో మీకే తెలుసని అన్నారు. సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎక్కడా ఏవిధమైన అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా పని చేయాలని సూచించారు. నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలు అవసరం లేదని అర్హత ఉన్నవారికి సంక్షేమ ఫలాలు అందించడమే మన ద్యేయంగా ఉండాలని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడితేనే వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకుంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, తహసీల్దార్లు, ఎంపిడివోలు, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
