cell tower battery theft
* 13 చోట్ల భారీ స్కెచ్
* పనితీరు దెబ్బతినకుండానే బ్యాటరీల మాయం
* పోలీసుల చేతికి చిక్కిన నల్గొండ గ్యాంగ్
* పగలు చేపల చోరీ.. రాత్రి సెల్ టవర్లపై కన్ను
* ఐదుగురు నిందితుల అరెస్ట్
ఆకేరు న్యూస్, వరంగల్: శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్లను లక్ష్యంగా చేసుకుని బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న ఒక భారీ అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఐదుగురు సభ్యులను హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుండి సుమారు 144 బ్యాటరీలు, రూ. 2,60,000 నగదు, రెండు ట్రాలీలు మరియు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ. 4,58,000 ఉంటుందని అంచనా.
* వినూత్నమైన చోరీ పద్ధతి..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ నిందితుల నేర ప్రవృత్తిని వివరించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు కొంపల్లి గణేష్ (డ్రైవర్) కాగా, మిగిలిన నిందితులు సుధాకర్, శివాజీలకు జనరేటర్ మరమ్మతులు మరియు సెల్ టవర్ పనుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉంది.
సాధారణంగా సెల్ టవర్లలో బ్యాటరీల సెట్ ఉంటుంది. నిందితులు తమ పరిజ్ఞానంతో టవర్ పనితీరుకు ఆటంకం కలగకుండా కొన్ని బ్యాటరీలను చాకచక్యంగా తొలగించేవారు. దీనివల్ల వెంటనే సిగ్నల్ సమస్యలు రావు కాబట్టి అధికారులు గుర్తించే లోపే నిందితులు అక్కడి నుండి జారుకునేవారు. ఇలా దొంగిలించిన బ్యాటరీలను మహారాష్ట్రలోని గచ్చిరోలి ప్రాంతంలో విక్రయించి జల్సాలు చేసేవారు.
* చేపల చోరీ నుంచి బ్యాటరీల వరకు..
ఈ ముఠా నేర ప్రస్థానం కేవలం బ్యాటరీలకే పరిమితం కాలేదు. రాత్రి సమయాల్లో చెరువుల్లో చేపల చోరీకి వెళ్లే ఇతర నేరగాళ్లతో వీరికి పరిచయం ఏర్పడింది. చేపల దొంగతనానికి రెక్కీ నిర్వహిస్తున్న సమయంలోనే శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్లను కూడా గుర్తించి, దొరికిన కాడికి దోచుకునేవారు. దొంగిలించిన చేపలను నల్గొండ మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించేవారు.
వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని మొత్తం 13 చోట్ల వీరు బ్యాటరీల చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
* కేసు ఛేదించింది ఇలా..
గత మార్చి 3వ తేదీన హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ సెల్ టవర్ నుండి 48 బ్యాటరీలు మాయమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత నేతృత్వంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగించి నిందితుల కదలికలను నిరంతరం పర్యవేక్షించారు.
ఈ రోజు తెల్లవారుజామున హసన్‌పర్తి మండలం దేవన్నపేట గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద దొంగిలించిన సొత్తును అమ్మేందుకు నిందితులు వేచి ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు:
కొంపల్లి గణేష్ (27)
బొంగరాల సుధాకర్ (30)
తన్నీరు శివాజీ (26)
బీమనబోయిన నరసింహ (31)
గడగోజు సురేష్ (25)
* పోలీసులకు అభినందనలు:
క్లిష్టమైన ఈ కేసును ఛేదించడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, హసన్‌పర్తి ఇన్స్‌స్పెక్టర్ చేరాలు, ఎస్.ఐలు దేవేందర్, సుజిత్ రెడ్డి మరియు కానిస్టేబుళ్లు క్రాంతి కుమార్, బావు సింగ్, వెంకట స్వామి, భరత్‌లను కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.
