Punnelu murder case solved
* రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పున్నెలు హత్యల కేసు ఛేదన..
* వైద్యులతో సహా 10 మంది అరెస్ట్.
* మైనర్ బాలికపై మోజు.. అడ్డు తొలగించుకోవాలని భార్యాపిల్లల హత్య
ఆకేరు న్యూస్, వరంగల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా పున్నెలు గ్రామానికి చెందిన భార్య, ఇద్దరు కుమార్తెల హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో పాటు, మరో మైనర్ బాలికను వివాహం చేసుకోవాలనే దురాశతో కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యను కడతేర్చిన కిరాతకుడు అజారుద్దీన్‌తో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు.
* ప్రేమ వివాహం.. విద్వేషంగా మారింది
పోలీసుల కథనం ప్రకారం.. ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ఎం.డి. అజారుద్దీన్ (29) అదే గ్రామానికి చెందిన ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా (9), ఆయేషా (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, అజారుద్దీన్ కుటుంబ సభ్యులకు మగ సంతానం కావాలనే కోరిక బలంగా ఉండేది. 2021, 2022లో ఫరహాత్ గర్భం దాల్చిన ప్రతిసారీ.. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి, ఆడపిల్ల అని తెలియగానే డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల సహకారంతో బలవంతంగా అబార్షన్లు చేయించారు.
* మైనర్ బాలికపై మోజు.. హత్యకు ప్లాన్
ఇదే క్రమంలో అజారుద్దీన్ తన దూరపు బంధువైన ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేయగా, “నీకు అప్పటికే భార్య, పిల్లలు ఉన్నారు.. నిన్ను పెళ్లి చేసుకోను” అని ఆ బాలిక తిరస్కరించింది. తన ప్రేమకు భార్యాపిల్లలే అడ్డంకి అని భావించిన అజారుద్దీన్, వారిని ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో ఫరహాత్ మళ్ళీ గర్భం దాల్చడం, ఆ ఇంట్లో గొడవలకు దారితీసింది.
* స్విమ్మింగ్ పూల్‌లో అత్యంత పాశవికంగా..
ఈ నెల 1వ తేదీన తన కిరాతక ప్లాన్‌ను అమలు చేశాడు అజారుద్దీన్. ఐస్ క్రీం తినిపిస్తానని నమ్మించి రాత్రి 7:50 గంటల సమయంలో భార్యాపిల్లలను తాను నడుపుతున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు కారులో తీసుకెళ్లాడు. ముందుగానే అక్కడ సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఎవరూ లేని సమయంలో ముగ్గురినీ నీటిలోకి నెట్టేశాడు. వారు ప్రాణాల కోసం కొట్టుకుంటున్నా కనికరించకుండా, నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేశాడు. అనంతరం వారు ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడు.
* పోలీసుల వేట.. 10 మంది అరెస్ట్..
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుడి గుట్టు రట్టు చేశారు. ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన అజారుద్దీన్ తల్లిదండ్రులు, తమ్ముడు సహా అక్రమ అబార్షన్లకు సహకరించిన ఆర్.ఎం.పిలు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న డాక్టర్ బాల్నె పూర్ణిమ, డాక్టర్ రవళి కోసం గాలింపు చేపట్టారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన డీసీపీ అంకిత్ కుమార్, ఏసీపీ వెంకటేష్, సీఐలు రాజగోపాల్, విశ్వేశ్వర్, శ్రీనివాస్ మరియు వారి బృందాన్ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
