Vande Bharat passengers new record
* 4 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చిన వందే భారత్
ఆకేరు న్యూస్, కమలాపూర్
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు, ప్రయాణికుల ఆదరణలో దూసుకుపోతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 4 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. మొత్తంగా 9.1 కోట్లకు పైగా ప్రయాణికులు ఈ ఆధునిక రైలులో ప్రయాణించారని, కేవలం లక్ష ట్రిప్పుల్లోనే ఈ అద్భుత మైలురాయిని చేరుకోవడం విశేషమని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10, 2026 నాటికి నమోదైన ఈ గణాంకాలు దేశవ్యాప్తంగా వందే భారత్ పట్ల ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తున్నాయి.
అధునిక సౌకర్యాలు, విమాన ప్రయాణాన్ని తలపించే విలాసవంతమైన సీట్లు, వేగం అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉండటమే ఈ అసాధారణ విజయానికి ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, పర్యాటకులు, యువత వందే భారత్‌ను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నారు. భారతీయ జీవనశైలిని, ప్రయాణ సంస్కృతిని సమూలంగా మార్చేస్తున్న ఈ రైలు, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో, రాబోయే రోజుల్లో మరిన్ని మార్గాల్లో వందే భారత్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
