ఎన్డీఏ పక్షాల సమావేశంలో చంద్రబాబునాయుడు మరియు పవన్‌కల్యాణ్
* భారత్‌కు సరైన నాయకుడు
* దేశకీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారు
* మోదీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్నాం
* ఎన్డీఏ పక్షాల సమావేశంలో చంద్రబాబునాయుడు
* మేమంతా మోదీ వెంటే : పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎంతో మంది నేతలను చూశాను కానీ.. మోదీ లాంటి పవర్ఫుల్ వ్యక్తిని ఎక్కడా చూడలేదని తెలుగుదేశం అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో శుక్రవారం జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్డీఏ పక్ష నాయకుడిగా మోదీని బలపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏను అధికారంలోకి తేవడానికి మూడు నెలలుగా మోదీ రాత్రి, పగలు కష్టపడ్డారని తెలిపారు. ఏపీలోని కీలక సభల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. అందుకే ఎన్డీఏ అద్భుత మెజారిటీ సాధించిందని వెల్లడించారు. పదేళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారని మోదీని కొనియాడారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ అన్నారు. మేకిన్ ఇండియా విజన్‌తో దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారని, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు పేరు తెచ్చారని అన్నారు. భారతదేశంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు మోదీ నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. తొలి నుంచి ఎన్డీఏతో తెలుగుదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. మోదీ నేతృత్వంలో భారత్ ఒకటో లేదా రెండో అగ్రదేశంగా ఎదుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు ఏ ఇజాలూ తెలియవని, మానవత్వమే తెలుసని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పేవారని, మోదీ కూడా అవే భావజాలాలు ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఇదొక గొప్ప సందర్భం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మోదీ మార్గదర్శకం వల్లే దేశం అభివృద్ధి : పవన్
మోదీ మార్గదర్శకం వల్లే దేశం అభివృద్ధి చెందుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వెల్లడించారు. యావత్ దేశానికి మోదీ ప్రేరణ ఇచ్చారని కొనియాడారు. మేమంతా మోదీ వెంటే నడుస్తామని పవన్ చెప్పారు. దేశానికి మోదీ 15 ఏళ్లు సేవలందిస్తారని 2014లో చంద్రబాబు చెప్పారని, అది నిజమైందని గుర్తు చేశారు. పవన్ మాట్లాడుతుండగా.. ఆ సమయంలో ధన్యవాదాలు చెబుతూ మోదీ చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
