* ఎల్ ఆర్ ఎస్ దుర్వినియోగం కాకూడదు
* ఆరోగ్యశ్రీలో ఇక నెలవారి చెల్లింపులు
– డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Dy CM Batti Vikramarka ) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
* ఆదాయ మార్గాలు ఎట్లా..?
ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించి ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఎటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. . ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ టాక్స్ విభాగాల్లో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్షించాలి. తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇటీవల సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిన విషయాన్ని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు.
* ఎల్ ఆర్ ఎస్ దుర్వినియోగం కాకూడదు
ఎల్ ఆర్ ఎస్ ( LRS ) దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి, ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రగతి లేకపోవడానికి కారణాలను తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. ఈ పథకం ఎట్టి పరిస్థితుల్లొ దుర్విని యోగం కాకుండా చూసుకోవాలన్నారు. పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) అమలు చేయాలి. ఇదే అవకాశంగా కొంత మంది ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉందన్నారు. హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇల్లు, వచ్చిన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ విక్రయించని ఇండ్లు, ఇళ్ల స్థలాల ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు.
ఆరోగ్యశ్రీలో ఇక నెలవారి చెల్లింపులు
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యులు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు వివరించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారి చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేటు ఆసుపత్రిలో ఆయా చికిత్సలు అందించేందుకు వారిని ఒప్పించాలి. ఈ పథకం సామాజిక బాధ్యతలో భాగమని వారికి వివరించి వారిని ఒప్పించాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రసాద్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
—————————————