Indiramma Housing Scheme Launch
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదల స్వంత ఇంటి కళ సాకారం అవుతుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తానేదార్ పల్లిని ఫైలెట్ గ్రామంగా ఎంపిక చేసి 91 ఇళ్లను మంజూరు చేసుకుని ఈరోజు ప్రారంభించుకున్నాం అన్నారు.
ఈ ఒక్క గ్రామంలోనే 4 కోట్ల 55 లక్షలతో 91 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మే 31 లోగ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు.
నియోజకవర్గంలోనే అత్యధిక ఇందిరమ్మ ఇళ్లను మన తానేదార్ పల్లిలోనే మంజూరు చేసుకున్నామని తెలిపారు. పేద ప్రజలు తమ స్వంత ఇంటి కళను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సాయంతో సాకారం చేసుకుంటున్నారని తెలిపారు. ఇది పేద ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ముందు వరుసలో ఉందని వెల్లడించారు. సర్పంచులు, అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతీ లబ్ధిదారుని వద్దకు వెళ్లి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. మే 31లోగ మొదటి విడత ఇళ్లను పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల 500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లిన పదుల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే 6 గ్యారెంటీల అమలులో భాగంగా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, సన్నాలకు బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని వెల్లడించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే నా ఆలోచన అని తెలిపారు. ఘనపూర్ రిజర్వాయర్ కింద 1L నుండి 10L వరకు ఉన్న కాలువలకు మారమ్మత్తు చేసి ప్రతీ గ్రామానికి సాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. దింతో ఒకప్పుడు వలస వెళ్లే వారు వ్యవసాయం చేయడం ద్వారా నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. దాదాపు లక్ష ఎకరాలలో వరి సాగు, 20 వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు అవుతోందని తెలిపారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి సాగు నీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనులు చేయించానని దాని ఫలితాంగానే నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయని వెల్లడించారు. అయితే కొంత మంది నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చేయకుండా పనులు, పథకాలు, పదవులు అమ్ముకున్న వారే ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గాలలో ఒకటిగా నిలపడమే నా ఏకైక లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ హరిత ఇంద్రారెడ్డి, బలిదే వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, హౌసింగ్, పిఆర్ డిఈలు, ఏఈలు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
